పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం..20 మంది సజీవదహనం

పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న బస్సు వెనుక నుంచి ఆయిల్ ట్యాంకర్ ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భారీ ఎత్తున మంటలు చెలరేగగా, 20 మంది సజీవదహనమయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 24 మంది ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారు. ఆ బస్సు కరాచీ నుంచి లాహోర్ వెళ్తుండగా..ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరగగానే ట్యాంకర్ డ్రైవర్ పరారయ్యాడు.

ఈ ప్రమాదంలో కొంతమంది మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. డీఎన్ఏ టెస్టుల ద్వారా మృతదేహాల గుర్తింపు చేపడతామని అధికారులు తెలిపారు. గాయాలపాలైన ఆరుగురిని ముల్తాన్ నగరంలోని నిష్తార్ ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు అభిప్రాయపడ్డారు. రోడ్డు ప్రమాద ఘటనపై పాకిస్థాన్ ప్రధాని షేబాజ్ షరీఫ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇంతమంది ప్రాణాలు కోల్పవడం కలచివేస్తోందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు షేబాజ్ షరీఫ్.