వివాదంలో చిక్కుకున్న ఫిన్లాండ్ ప్రధాని సనా మారిన్‌

పార్టీలో చిందులేస్తూ కనిపించిన ఫిన్లాండ్ ప్రధాని.. డ్రగ్స్ తీసుకున్నారంటూ ప్రతిపక్షాల విమర్శలు

Sanna Marin
Sanna Marin

హెల్సింకిః ఫిన్లాండ్ ప్రధాని సనా మారిన్‌ వివాదంలో చిక్కుకున్నారు. స్నేహితులతో కలిసి ఓ పార్టీలో డ్యాన్స్ చేస్తున్న ఆమె వీడియో వైరల్ కావడమే ఇందుకు కారణం. ఈ వీడియో బయటకు రాగానే ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ఆమెపై ఆరోపణలు గుప్పించాయి. పార్టీలో ఆమె డ్రగ్స్ తీసుకుని ఉండొచ్చని, అందుకే ఆమె అంతలా పార్టీలో చిందేశారని అనుమానం వ్యక్తం చేశాయి. ఆమెకు డ్రగ్ టెస్ట్ కూడా చేయించాలని డిమాండ్ చేశాయి.

తనపై వస్తున్న ఈ వార్తలపై మారిన్ స్పందించారు. తాను ఆ పార్టీలో డ్రగ్స్ తీసుకోలేదని, ఆల్కహాల్ మాత్రమే తీసుకున్నానని వివరించారు. అంతేకాదు, వీడియో రికార్డు చేస్తున్న విషయం కూడా తనకు తెలుసని అన్నారు. అయితే, వీడియో బయటకు రావడం విచారకరమన్నారు. ఓ రోజు సాయంత్రం మిత్రులందరం కలిసి పార్టీ చేసుకున్నామని, పాటలు పాడుతూ డ్యాన్స్ చేశామని పేర్కొన్నారు. అది చట్టబద్ధమేనని స్పష్టం చేశారు. ప్రైవేటు వీడియో లీక్ కావడం మాత్రం దురదృష్టకరమన్నారు. కాగా, గతంలో ఓ కరోనా రోగితో సన్నిహితంగా మెలిగిన సనా.. ఆ తర్వాత ఓ క్లబ్‌కు వెళ్లినందుకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/movies/