హుజూరాబాద్‌ ఉప ఎన్నిక : నామినేషన్‌ వేయనివ్వడం లేదని ఫీల్డ్‌ అసిస్టెంట్లు నిరసన..

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక వేడి ఎలాగుందో చెప్పాల్సిన పనిలేదు. ఓ పక్క ఈటెల , మరోపక్క తెరాస ఈ ఇద్దరే కాదు ఫీల్డ్‌ అసిస్టెంట్లు సైతం భారీ సంఖ్యలో నామినేషన్‌లు వేస్తుండడం ఇప్పుడు మారింది వేడి పెంచింది. అయితే అధికారులు కరోనా నిబంధనలు చెప్పి నామినేషన్‌ వేయనివ్వడం లేదని అంబేద్కర్‌ చౌరస్తాలో ఫీల్డ్‌ అసిస్టెంట్లు నిరసనకు దిగారు. ఈ నెల 8 వరకు నామినేషన్ల స్వీకరణకు తుది గడువు కాగా.. 13 వరకూ ఉపసంహరణకు గడువు. ఈ తరుణంలో ఈరోజు దాదాపు 150 మంది ఫీల్డ్‌ అసిస్టెంట్లు నామినేషన్ వేసేందుకు వచ్చారు. ఈ తరుణంలో కోవిడ్‌ నిబంధనలు, వ్యాక్సిన్‌ సర్టిఫికెట్‌ కావాలి అంటూ అధికారులు రూల్స్‌ పెట్టారు. దీంతో వారంతా ఆందోళన బాట పట్టారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్‌ గోయల్‌కు లేఖరాశారు వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల. హుజురాబాద్‌ ఉప ఎన్నికల రిటర్నింగ్‌ ఆఫీసర్‌ను తొలగించాలి, స్థానిక పోలీస్‌ కమిషన్‌పై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఉప ఎన్నికల్లో నిరుద్యోగులు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు, ఇతర వర్గాల వారు నామినేషన్లు వేయకుండా అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని.. నామినేషన్లకు దరఖాస్తులు కూడా ఇవ్వడం లేదని.. అభ్యర్థి మద్దతుదారులను స్థానిక మండలాల పోలీసులతో బెదరించి, వెనక్కి పంపిస్తున్నారంటూ ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఇదేంటని ప్రశ్నించిన వారిని పోలీసులు తమ అదుపులోకి తీసుకుని కేసులు బనాయిస్తున్నారని షర్మిల పేర్కొన్నారు.