సొంత పార్టీ సీనియర్‌ నేతపై టిఆర్ఎస్ మహిళా సర్పంచ్ కీలక ఆరోపణలు

తనను లొంగదీసుకునేందుకు ఓ సీనియర్ నేత ట్రై చేస్తున్నారని జానకీపురం సర్పంచ్ ఆరోపణ

TRS Party
TRS Party

హైదరాబాద్‌ః టిఆర్ఎస్‌కు చెందిన ఓ మహిళా సర్పంచ్ సొంత పార్టీకి చెందిన ఓ సీనియర్ నేతపై కీలక ఆరోపణలు చేశారు. తనను లొంగదీసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడంటూ జానకీపురం సర్పంచ్ నవ్య ఆరోపించారు. ఈ ఉదంతం ప్రస్తుతం హనుమకొండ జిల్లాలో కలకలం రేపుతోంది. మధ్యవర్తులతో తనను లొంగదీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని నవ్య ఆవేదన వ్యక్తం చేశారు. తాను లొంగకపోవడంతో వేధింపులకు దిగుతున్నారని వాపోయారు. డబ్బు, బంగారం ఆశ చూపించి తనను లోబరుచుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు.

తన మీద, తన కుటుంబం మీద పార్టీ సీనియర్ నేత సాగిస్తున్న వేధింపుల విషయం పార్టీ అధినేత కెసిఆర్, కెటిఆర్ దృష్టికి తీసుకెళతానని నవ్య పేర్కొన్నారు. ఇలాంటి వారి వల్ల పార్టీకి కూడా నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. ఆ నేతకు లొంగకపోవడంతో పార్టీ పెద్దలు కొందరు తనకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని కూడా ఆరోపించారు. ఆ కీలక నేత చిలిపి చేష్టలు అందరికీ తెలుసునని, ఇప్పటికే పలు వీడియోలు వైరల్ అయ్యాయని కూడా గుర్తు చేశారు. అయితే.. తాను ఈ వేధింపులకు బెదిరిపోనని నవ్య స్పష్టం చేశారు.