రైతుల అభివృద్ధి కోసం కేంద్రం కట్టుబడి ఉంది

మా ప్రభుత్వం రైతులకు వ్యతిరేకం కాదు .. గడ్కరీ

nitin gadkari
nitin gadkari

న్యూఢిల్లీ: కేంద్ర నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు చేస్తున్న ఆందోళనలు వరుసగా 20వ రోజు కొనసాగుతున్నాయి. అయితే రైతులతో ప్రభుత్వం జరుపుతోన్న చర్చలు విఫలమవుతున్న నేపథ్యంలో కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ ఈ విషయంపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకం కాదని చెప్పుకొచ్చారు. తాము తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను అన్నదాతలు అర్థం చేసుకోవాలని హితవు పలికారు. రైతుల అభివృద్ధి కోసం కేంద్రం కట్టుబడి ఉందని తెలిపారు. సమస్యల పరిష్కారం విషయంలో రైతులు చర్చలకు రావాలని అన్నారు.

వారు కొత్త చట్టాలపై అవగాహన పెంచుకోవాలని నితిన్ గడ్కరీ చెప్పారు. అలాగే, ఆ వ్యవసాయ చట్టాలపై రైతులు ఇచ్చే సూచనలను స్వీకరించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. రైతులు చేస్తోన్న ఆందోళనల్లో కొన్ని శక్తులు జోక్యం చేసుకుని ఈ ఆందోళనలు దుర్వినియోగమయ్యేలా రైతులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని చెప్పుకొచ్చారు. రైతులకు వ్యతిరేకంగా తాము ఎలాంటి చట్టాలు చేయలేదని తెలిపారు. నూతన చట్టాలతో అన్నదాతలు తమ పంటలను దేశంలో ఎక్కడైనా, ఎవరికైనా అమ్ముకోవచ్చని వివరించారు. ఇదే విషయాన్ని వారికి అర్థమయ్యేలా చెప్పేందుకు తమ సర్కారు ప్రయత్నాలు జరుపుతోందని తెలిపారు. ఒకవేళ రైతులు ప్రభుత్వంతో చర్చలు జరపకపోతే దుష్ప్రచారం జరగడమే కాకుండా, వివాదాలు తలెత్తే ప్రమాదమూ ఉందని ఆయన చెప్పుకొచ్చారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/