హుజురాబాద్ లో తెరాస ఓడిందో లేదో..అప్పుడే ప్రజల్లో మార్పు మొదలైంది

హుజురాబాద్ ఉప ఎన్నిక లో తెరాస పార్టీ ని ఓడించిన బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్..తెలంగాణ‌లో రాజ‌కీయ మార్పున‌కు శ్రీకారం చుట్టినట్లు అయ్యిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.అనడమే కాదు ఇప్పుడు అదే జరిగింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫ‌లితం వెలువ‌డి క‌నీసం 24 గంట‌లు కూడా గడవకముందే తెరాస పార్టీ కి షాక్ ఇచ్చారు హనుమకొండ రైతులు.

హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం దేవన్నపేటలో టీఆర్ఎస్‌ సభ నిర్వహణకు స్థలం ఇవ్వబోమని అక్క‌డి రైతులు తేల్చి చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. టీఆర్ఎస్ పార్టీ ఈ నెల 29న నిర్వహించతలపెట్టిన ‘విజయగర్జన సభ’ కోసం స్థల పరిశీలనకు వెళ్లిన టీఆర్ఎస్ నేతలను స్థానిక రైతులు అడ్డుకున్నారు. సభ పెట్టాలనుకున్న స్థలంలో పంటలు కోత దశలో ఉన్నాయి. దాంతో రైతులు తమ పోలాలను సభ కోసం ఇచ్చేదిలేదని తేల్చిచెప్పారు. పంటలు ఇప్పుడే కోత దశకు వస్తున్నాయని.. సభ కోసం పంట భూములు ఎలా ఇస్తామంటూ టీఆర్ఎస్ నేతలపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదంతా హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ ప‌రాజ‌యం ఫ‌లిత‌మ‌ని చెబుతున్నారు. టీఆర్ఎస్‌ ఆవిర్భవించి రెండు దశాబ్దాలు పూర్తి కావ‌స్తోంది. దీన్ని పుర‌స్క‌రించుకుని వరంగల్‌లో ‘విజయ గర్జన’ సభ నిర్వహించాల‌ని అధికార పార్టీ టీఆర్ఎస్ నిర్ణ‌యించింది. తెరాస కు వ‌రంగ‌ల్ గుండెకాయ లాంటిది. సభ ఏర్పాట్లలో భాగంగా వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ వినయ్‌ భాస్కర్‌, మాజీ మంత్రి కడియం శ్రీహరి, ఇత‌ర నాయకులు దేవన్నపేటలో సభా స్థలాన్ని ప‌రిశీలించేందుకు వెళ్లారు. గ్రామ శివారులోని పంట పొలాలతో పాటు ఖాళీ ప్రదేశాన్ని ప‌రిశీలిస్తున్న‌ ప్రజాప్రతినిధుల వద్దకు స్థానిక రైతులు వెళ్లి త‌మ అభ్యంత‌రాన్ని వ్య‌క్తం చేశారు. పంట పండే తమ పొలాలను స‌భ నిర్వ‌హ‌ణ‌కు ఇచ్చే ప్ర‌శ్నే లేద‌ని ఆందోళనకు దిగారు.

రైతుల‌కు బీజేపీ నేత‌లు అండ‌గా నిలిచారు. దీంతో టీఆర్ఎస్ స్థానిక నాయ‌కులు, రైతులు, బీజేపీ నేత‌ల మ‌ధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ప‌ర‌స్ప‌రం తోపులాట‌కు దిగ‌డంతో ప‌రిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరువ‌ర్గాల‌కు పోలీసులు స‌ర్ది చెప్పారు. ఈ వ్యవహారం చూస్తే తెరాస ఫై వ్యతిరేకతను ప్రజలు భయపెడుతున్నారని అర్ధమవుతుంది.