బీజేపీలో కుటుంబ రాజకీయాలు నడవవు : ప్రధాని మోడీ

ఎంపీలతో బీజేపీ పార్లమెంటరీ ప్రధాని సమావేశం

family-politics-wont-work-in-bjp-pm-modi-warns-pary-mps

న్యూఢిల్లీ: బీజేపీలో కుటుంబ రాజకీయాలు నడవవని పార్టీ ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోడీ తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. ఇవాళ పార్టీ పార్లమెంటరీ సమావేశంలో ఎంపీలతో పలు విషయాలను ఆయన చర్చించారు. ‘‘పార్టీలో కుటుంబ రాజకీయాలు పనిచేయవు. ఇతర పార్టీల్లోని వారసత్వ రాజకీయాలపై మనం పోరాడాలి. కాబట్టి పార్టీలోని నేతల వారసులకు టికెట్లు ఇవ్వకపోతే చింతించొద్దు. అలా జరగడానికి పూర్తి బాధ్యత నాదే. వారసత్వ రాజకీయాలకు మనం వ్యతిరేకం కదా?’’ అని మోడీ సూచించినట్టు తెలుస్తోంది. యుద్ధంతో అల్లాడిపోతున్న ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు గురించి కూడా ఎంపీలతో ప్రధాని చర్చించినట్టు సమాచారం. ఈ విషయంపై ఇతర పార్టీల ముఖ్యమంత్రులు చేసిన రాజకీయాల గురించి మాట్లాడినట్టు చెబుతున్నారు.

కశ్మీర్ ఫైల్స్ సినిమా గురించి ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. 1990ల్లో కశ్మీరీ పండిట్లపై జరిగిన అకృత్యాలు, వారి వలసల నేపథ్యంలో తెరకెక్కించిన సినిమాను ఆయన ప్రశంసించారు. ‘‘కొన్ని వర్గాలు ఇప్పటికీ కశ్మీరీ పండిట్లపై జరిగిన అకృత్యాలను తొక్కిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. గతంలోనూ వాళ్లు అలాగే చేశారు. ఇప్పుడూ అదే చేయాలని చూస్తున్నారు. నిజాలు బయటకు రాకుండా చేస్తున్నారు. ప్రతి ఒక్క ఎంపీ కశ్మీర్ ఫైల్స్ సినిమాను చూడాలి. పండిట్లపై జరిగిన అకృత్యాలను కళ్లకు కట్టారు. చాలా అద్భుతంగా తీశారు. ఇలాంటి మరిన్ని సినిమాలు రావాలి’’ అని ప్రధాని చెప్పినట్టు బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ చెప్పారు.

గత ఎన్నికల ఫలితాలపైనా మోడీ చర్చించారు. ఓడిపోయిన చోట్ల కారణాలను విశ్లేషించుకోవాల్సిందిగా పార్టీ ఎంపీలకు సూచించినట్టు తెలుస్తోంది. కాగా, సమావేశం సందర్భంగా ప్రముఖ గాయని లతా మంగేష్కర్, ఉక్రెయిన్ లో రష్యా దాడికి బలైన కర్ణాటక విద్యార్థి నవీన్ శేఖరప్ప, భజరంగ్ దళ్ కార్యకర్త హర్షలకు సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/