పెద్దల పట్ల బాధ్యతగా ..

FAMILY
FAMILY

పెద్దల పట్ల బాధ్యతగా ..

తలిదండ్రుల ఆప్యాయతానురాగాలు, తాతలు తాతమ్మల ముద్దుమురిపాలు, బాబాయి పిన్నమ్మల గారాబాలు, మంచితనం గురించి సత్ప్రవర్తన గలవారిగా మలచాలన్న తాపత్రయం ఉన్న ఇంటిపెద్దలు. ఏది మంచి, చెడ్డ తెలియజేసే కుటుంబసభ్యులు, నడవడిని నేర్పించే మామయ్యలు, అత్తమ్మలు పెదనానన్నలు, పెద్దమ్మలు లాంటి వారు రోజురోజుకు మనకు కనుమరుగవుతున్నారు. డబ్బు సంపాదించటం తప్ప మరొక ఆలోచన, ధ్యేయం లేకుండా అవరం అయితే అక్రమమార్గంలో కూడా ధనార్జన చేయటానికి పెద్దలను బరువుగా భావించి, తన కుటుంబం, తన బరువు బాధ్యతలు అంటూ ఒంటరి పరుగుతీస్తూ వేరు కాపురాలకు ఇష్టపడుతున్నారు. మంచి కబుర్లు చెప్పే తాతయ్యలు మానవత్వం నేర్పే మామ్మలు, కంటికి రెప్పలా కాపాడే ఇతర కుటుంబసభ్యులు లేకున్నారు. ఇందుకు కారణం మానవీయ విలువలు తగ్గుతున్నందున ఒకరిపట్ల ఒకరికి ప్రేమ కొరవడి విడివిడిగా భావనలు కలిగి ఉండటం కారణమవుతున్నది. మానవతా విలువలను పెంచే బాధ్యతని తల్లిదండ్రులు, అధ్యాపకులు తీసుకుంటే రేపు వారు పెద్దయ్యాక సత్ప్రవర్తన, సశ్చీలత కలిగి పౌరులై సమాజంలో మంచి వ్యక్త్తివం గల వ్యక్తులుగా పేరు తెచ్చుకుంటారు. తల్లిదండ్రులు పిల్లల చేత గౌరవించబడాలి. వారికి చక్కని ఆదరణ లభించాలి. వారి మనసులు ఏ మాత్రం నొచ్చుకోకుండా వారిని ఏ విధంగానూ నొప్పించకుండా నడుచుకోవాలి. తల్లిదండ్రుల మనసులో తాము అనాధలం అన్న ఆలోచన రానీయకూడదు. వృద్ధుల మనస్తత్వం పసిపిల్లల మనస్తత్వాన్ని పోలి ఉంటుంది. వారిని పసిపిల్లల వలె చూడాలి తప్ప వారిని అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వారిని గౌరవించేలా తప్ప పొరపాటున కూడా కించపరచకూడదు. కుటుంబంలోని వారందరూ తల్లిదండ్రుల్ని పెద్దవారుగా గౌరవించి ఆదరించేలా ఇంటి వాతావరణాన్ని రూపుదిద్దాలి. వారు ఎంతగా కష్టపడితే మనం ఇంతమఆవాళ్లమయ్యామన్న విషయాన్ని ఇంట్లో వారికి చెపుతూ వారి పట్ల గౌరవాన్ని పెంచాలి. మాతృదేవోభవ, పితృదేవోభవ కళ్లముందు కనిపించే ఆ భగవంతుని స్వరూపాలుగా తల్లిదండ్రుల్ని భావించి ఆరాధించాలి. అలక్ష్యంగా వారిపట్ల ప్రవర్తించకూడదు. ఎట్టి పరిస్థితుల్లోను తల్లిదండ్రులను అనాధశ్రమాల పాలు చేయకూడదు. వారి అనుభవాల్ని, సలహాలుగా పొందే ప్రయత్నం చేయాలే తప్ప వారిపట్ల నిర్లక్ష్యవైఖరి ఉండకూడదు. ప్రతినిత్యం ఎంతో కొంత సమయం వారి దగ్గర గడిపే ప్రయత్నం చేయాలి. పిల్లలముందు ఎట్టి పరిస్థితుల్లోనూ పెద్దల్ని తూలనాడటం, చిన్నబుచ్చటం వంటి చేయనేకూడదు. మరోవేయి జన్మలెత్తినా ఇలాంటి పిల్లలు మాకు కావాలంటూ ఆ భగవంతుడ్ని తల్లిదండ్రులు వేడుకునేలా కొడుకులు, కూతుర్ల ప్రవర్తన ఉండాలి. వయసు మీరిన వారికి మానసిక, శారీరక పటష్టత తగ్గి జ్ఞాపకశక్తి క్షీణించవచ్చు. కాని వారి అనుభవసారం వారికి పెద్ద సంపద. ఈ సంపదను కూడా యువత గౌరవించకపోవడంతో వారి జీవితాలు నిస్సారంగా తయారయ్యాయని ఆవేదన చెందుతుంటారు. అమ్మానాన్నలను అపురూపంగా సేవించాలి. గురువులను గౌరవించాలి. కుటుంబాన్ని సంతోషసాగరంలో ముంచేయాలి. అక్కాచెల్లెళ్లు, అన్నతమ్ములకు మమతానురాగాలు అందించాలి. మాతాపితరులను, పెద్దలను, గురువులను అగౌరపరచరాదని వారికి సేవ చేయమనీ వేదం చెపుతున్నది. సాధారణంగా యౌవనదశలో ఉన్న యువతకు సర్వం తమకే తెలుసుననే అతి విశ్వాసం ఉంటుంది. అలాంటి అతివిశ్వాసం, అహంకారం, తమలో ఉన్నవని తెలుసుకునే సమయానికి జీవన ప్రయాణం కాస్త ముగిసిపోతుంది. ప్రస్తుత కాలంలో నెలకొన్న హడావుడి పరిస్థితులలో పొద్దున లేచింది మొదలు రాత్రి వరకు పరుగుల జీవితం అలవాటైపోయింది. అనుబంధాలు తగ్గడం వల్ల పెద్దలు పిల్లలకు సరైన సలహాలు ఇవ్వలేకపోతున్నారు. పిల్లలను వారెంత ప్రేమగా పెంచారో అంతలా వృద్ధాప్యంలో వారిని ఆదరిస్తే వారే అసలైన పిల్లలు. అంతకుమించి ఏ తల్లిదండ్రి ఏమీ కోరుకోరు. అదే లోపిస్తే మాత్రం ఎంతో బాధకు గురి అవుతారు. తమ పెంపకంలోనే ఏదో పొరపాటు ఉందని బాధపడతారు.
– ఆర్‌విఎంసత్యం

=====