సూడాన్‌లో సైనిక తిరుగుబాటు …తిప్పికొట్టిన ప్రభుత్వ దళాలు

దేశంపై నియంత్రణ ప్రస్తుత అధికార మండలిదేనని స్పష్టీకరణ


సూడాన్‌: ప్రపంచవ్యాప్తంగా ఇటీవల కొన్ని దేశాలు క్రమంగా సైన్యం చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. తాజాగా ఆఫ్రికన్ కంట్రీ సూడాన్‌లోనూ సైన్యం తిరుగుబాటుకు యత్నించగా ప్రభుత్వ అనుకూల దళాలు తిప్పికొట్టాయి. స్వల్ప సంఖ్యలోనే ఉన్న తిరుగుబాటుదారులను అరెస్ట్ చేసినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దేశంపై నియంత్రణ ప్రస్తుత అధికార మండలి కలిగి ఉందని పేర్కొన్నాయి. తిరుగుబాటు నేపథ్యంలో సైనిక ప్రధాన కార్యాలయం, ప్రభుత్వ కార్యాలయాల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. రెండేళ్ల క్రితం నియంత ఒమర్ అల్ బషీర్‌కు వ్యతిరేకంగా ప్రజలు తిరగబడి మూడు దశాబ్దాల పాలనకు చరమగీతం పాడిన సంగతి తెలిసిందే.

కాగా, గతంలోనూ సైనిక తిరుగుబాట్లు జరిగినప్పటికీ ఇటీవల ఈ ట్రెండ్ కొంత ఎక్కువైనట్టు కనిపిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో మయన్మార్‌లో సైన్యం తిరుగుబాటు చేసి ఆంగ్‌సాన్ సూకీ నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వాన్ని కూల్చి అధికారాన్ని హస్తగతం చేసుకుంది. ఆగస్టులో ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయింది. ఈ నెలలో పశ్చిమ ఆఫ్రికా దేశమైన గినియానూ సైన్యం తన చేతుల్లోకి తీసుకుంది.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/