ఫేస్ బుక్ పేరు మారుతోంది?..పరిశీలనలో కొత్త పేర్లు

ఈ నెల 28న జుకర్ బర్గ్ ప్రకటించే అవకాశం
పరిశీలనలో ‘హొరైజన్’, ‘హొరైజన్ వరల్డ్స్’ అనే పేర్లు

న్యూఢిల్లీ: ఫేస్ బుక్.. నేటి తరానికి పరిచయం అక్కర్లేని పేరు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది దాని ద్వారా అనుసంధానమవుతున్నారు. లక్షలాది మంది వ్యాపారాలు చేసుకుంటున్నారు. అంతలా అందరికీ చేరువైన ఆ ‘ఫేస్ బుక్’ పేరు మారిపోతోందని తెలుస్తోంది. వచ్చే వారం కొత్త పేరును సంస్థ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ ప్రకటించనున్నట్టు సమాచారం. ఈ నెల 28న నిర్వహించే సంస్థ వార్షిక సదస్సు కనెక్ట్ లో ఆ వివరాలను జుకర్ బర్గ్ వెల్లడించనున్నట్టు చెబుతున్నారు. ‘హొరైజన్’ అనే పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. వర్క్ ప్లేస్ కొలాబరేషన్ కోసం ఫేస్ బుక్ ఇటీవల ‘హొరైజన్ వర్క్ రూమ్స్’ అనే కాన్సెప్ట్ ను పరిచయం చేసింది. దీంతో ఆ సంస్థ పేరు ‘హొరైజన్ వరల్డ్స్’ అయి ఉండొచ్చన్న వాదనా వినిపిస్తోంది.

తాము కేవలం సోషల్ మీడియాకే పరిమితం కాదని, ఫేస్ బుక్ గొడుగు కింద ఇంకా చాలా ఉన్నాయని చెప్పేందుకే పేరును మార్చుతున్నారన్న చర్చ జరుగుతోంది. దీనిపై ఇప్పుడే స్పందించేందుకు ఫేస్ బుక్ ప్రతినిధి నిరాకరించారు. ఇప్పటికే వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్, ఆక్యులస్ వంటివి ఫేస్ బుక్ లో భాగంగా ఉన్నాయి. ఏఆర్ (ఆగ్మెంటెడ్ రియాలిటీ) అద్దాల తయారీలో సంస్థ బిజీగా ఉంది. దాదాపు 10 వేల మంది ఉద్యోగులు దానిపై పనిచేస్తున్నారు. స్మార్ట్ ఫోన్లలాగానే ఏదో ఒక రోజు ఏఆర్ గ్లాసెస్ కూడా అందరి జీవితాల్లో భాగమైపోతాయని జుకర్ బర్గ్ భావిస్తున్నారు.

కాగా, సంస్థలు పేర్లను మార్చడం ఇదే తొలిసారి కాదు. అంతకుముందు 2015లో గూగుల్ ను ఆల్ఫాబెట్ కిందకు తీసుకొస్తూ సంస్థ పునర్వ్యవస్థీకరించింది. అప్పటిదాకా కేవలం సెర్చ్ ఇంజన్ గానే పేరుపడిపోయిన గూగుల్ ను.. డ్రైవర్ లెస్ కార్లు, హెల్త్ టెక్ కంపెనీగా ఎదిగింది. 2016లో స్నాప్ ఐఎన్ సీగా స్నాప్ చాట్ మారింది. అదే ఏడాది తొలి కళ్లద్దాలు, కెమెరా అద్దాలను లాంచ్ చేసిన ఆ సంస్థ.. కెమెరా కంపెనీగా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే ఫేస్ బుక్ లాంచ్ చేయబోతున్న కొత్త వ్యాపారాలేంటన్న దానిపై ఆసక్తి నెలకొంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/