అమెరికా ప్రభుత్వ వైఖరి నిరాశపర్చింది

కరోనా విషయంలో ఇతర దేశాలతో పోలిస్తే అమెరికా తీరు ఘోరంగా ఉంది..జుకర్‌బర్గ్

facebook ceo mark zuckerberg

వాషింగ్టన్‌: ఫేస్‌బుక్‌ సీఈఓ జుకర్‌బర్గ్‌ అమెరికాకు చెందిన అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంథోనీ ఫౌసీతో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. డొనాల్డ్‌ ట్రంప్‌ సర్కార్‌పై మరోసారి విమర్శలు గుప్పించారు. కరోనా సంక్షోభంపై ట్రంప్‌ ప్రభుత‍్వ వైఖరిపై నిరాశను వ్యక్తం చేశారు. కరోనా వైరస్‌ నియంత్రణలో అనేక ఇతర దేశాలతో పోలిస్తే అమెరికా తీరు ఘోరంగా ఉందన్నారు. ప్రాథమిక నిబంధనల అమలుతో పాటు, సమగ్ర నివారణ చర్యలు తీసుకొని ఉంటే జూలైలో రెండవ దశ కరోనాను నివారించే అవకాశం ఉండేదన్నారు. కరోనా నిర్ధారిత పరీక్షలు ఇప్పటికీ తగినన్ని అందుబాటులో లేకపోవడం నిజంగా నిరాశ కలిగిం చిందన్నారు. ప్రజారోగ్య చర్యలపై శాస్త్రవేత్తల సలహాలను పాటించడం లేదనీ, నిపుణుల హెచ్చరికలను కూడా పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. దీంతో దేశంలోని టాప్‌ సైంటిస్టుల, సీడీసీ విశ్వసనీయత దెబ్బతింటోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.


కాగా ప్రపంచంలోని ప్రతి అభివృద్ధి చెందిన దేశంలో కరోనా కేసుల నమోదు తక్కువ స్థాయిలోఉంటే, అమెరికాలో మాత్రం రోజువారీ రికార్డు స్థాయి కేసులు నమోదవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాణాంతక వ్యాధి కట్టడిలో అనేక ఇతర దేశాలు తీవ్రంగా కృషి చేసినప్పటికీ, అమెరికా ఈ విషయంలో వెనుకబడిందని వ్యాఖ్యానించారు. భౌతిక దూరం, మాస్క్‌లు ధరించడం లాంటి ఇతర భద్రతా చర్యలు తీసుకోకుండానే చాలా రాష్ట్రాలు నిబంధనల ఎత్తివేతకు, ఆర్థిక కార్యలాపాల పునరుద్ధరణకు తొందరపడ్డాయని డాక్టర్ ఫౌసీ అభిప్రాయపడ్డారు.  


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/