ప్రభుత్వాన్ని వ్యతిరేకించినంత మాత్రాన దేశద్రోహం కాదు..సుప్రీంకోర్టు

అసమ్మతికి, దేశద్రోహానికి తేడా ఉందన్న సుప్రీం ..పిటిషనర్ కు రూ.50 వేల జరిమానా

న్యూఢిల్లీ: ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించినంత మాత్రాన అది దేశద్రోహం కిందకు రాదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వ అభిప్రాయానికి భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనా, అసమ్మతి గళం వినిపించడానికి, దేశద్రోహానికి చాలా తేడా ఉందని పేర్కొంది. 370 అధికరణం రద్దుపై జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారించింది.

ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని కేంద్రం వెనక్కు తీసుకునేందుకు చైనా, పాకిస్థాన్ సాయాన్ని ఫరూఖ్ అబ్దుల్లా కోరారనడానికి కక్షిదారు సరైన ఆధారాలు చూపించలేదని పేర్కొంటూ వ్యాజ్యాన్ని కొట్టేసింది. కక్షిదారుకు రూ.50 వేల జరిమానాను విధించింది. 2019 ఆగస్టులో జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక హోదా, 370 ఆర్టికల్ ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/