మోదీ జమ్మూ పర్యటన కు ముందే భారీ బాంబు పేలుడు

ప్రధాని మోదీ జమ్మూకశ్మీర్​ పర్యటన వేళ బిశ్నా ప్రాంతంలో ఆదివారం తెల్లవారు జామున భారీ పేలుడు సంభవించింది. మోదీ ప్రసంగించనున్న సభకు 7 కిలోమీటర్ల దూరంలోనే ఈ బ్లాస్ట్​ జరగడం అందర్నీ షాక్ కు గురి చేసింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి పూర్తి స్థాయి పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ జమ్మూకాశ్మీర్ విచ్చేయనున్నారు. సాంబా జిల్లాలోని పల్లీ గ్రామంలో బహిరంగ సభను ఉద్దేశించి మోదీ మాట్లాడుతారు. సభా స్థలికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న లాలియన్ గ్రామంలో ఆదివారం ఉదయం పేలుడు సంభవించింది.

జమ్మూ జిల్లాలో బిష్నా పరిధిలోకి వచ్చే ఈ గ్రామంలో పేలుడుపై భద్రతా బలగాలు ఆరాతీస్తున్నాయి. గ్రామంలోని బహిరంగ వ్యవసాయ భూమిలో అనుమానాస్పద పేలుడు సంభవించినట్లు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. బహుశా ఇది పిడుగుపాటు లేదా ఉల్క వల్ల ఏర్పడి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనపై విచారణ కొనసాగుతున్నది. అదే సమయంలో మోదీ పర్యటనకు అసాధారణ భద్రత కల్పించారు. ఇక మోడీ ఈ పర్యటన లో బనిహాల్‌-కాజీగుండ్‌ సొరంగ మార్గంతో పాటు, రూ.20 వేల కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.