రేవంత్ రెడ్డి ఫై బంజారాహిల్స్‌ పోలీసులకు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్‌రెడ్డి పిర్యాదు

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫై పీజేఆర్‌ కుమారుడు, మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ నేత విష్ణువర్దన్‌రెడ్డి బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్‌ పబ్ లైంగిక దాడి ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన పట్ల రేవంత్ రెడ్డి పలు ఆరోపణలు చేసారు. జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ గుడి ఆవరణలో మైనర్‌నపై లైంగికదాడి జరిగిందని రేవంత్ ఆరోపించారు. అయితే రేవంత్‌ వ్యాఖ్యలను ఆలయ ట్రస్ట్‌ సభ్యులు ఖండించారు.

రేవంత్‌రెడ్డి అసత్య ఆరోపణలు చేశారని, ఆలయ ఆవరణలో బాలికపై అత్యాచారం జరగలేదని స్పష్టం చేశారు. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై పీజేఆర్‌ కుమారుడు, మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ నేత విష్ణువర్దన్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేవాలయంలో ఎలాంటి ఆసాంఘిక కార్యక్రమాలు జరగలేదన్నారు. ఇది పార్టీ వ్యవహారం కాదని.. పెద్దమ్మ తల్లి భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశమని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి చెప్పిన మాటలు తప్పు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు. రేవంత్‌పై టెంపుల్‌ తరపున పరువు నష్టం దావా వేస్తామని తెలిపారు.