చంద్రబాబు టూర్లో జేబు దొంగలు హల్చల్..మాజీ మంత్రి పర్సు మాయం

టీడీపీ అధినేత చంద్రబాబు ముంపు ప్రాంతాల పర్యటన లో షాకింగ్ ఘటనలు చోటుచేసుకున్నాయి. మొన్నటికి మొన్న పడవ బోల్తా పడి, టీడీపీ నేతలంతా గోదావరిలో పడిపోగా , తాజాగా అంబేద్కర్ కోనసీమ జిల్లా పర్యటన లో జేబు దొంగలు హల్చల్ చేసారు. మాజీ మంత్రి పర్సును మాయం చేసారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు , వరదలకు ముంపు ప్రాంతాలు నీటమునిగాయి. ఇప్పటికి అక్కడి ప్రజలు బయటకు రాలేకపోతున్నారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా వారి వద్దకు వెళ్లి వారి కష్టాలను చూసి..వారికీ ధైర్యం చెప్పారు. ప్రభుత్వం వెంటనే వారిని ఆదుకోవాలని సూచించారు. రెండు రోజుల పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో జరిపిన పర్యటన శుక్రవారం సాయంత్రంతో ముగిసింది.
పర్యటన లో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చంద్రబాబు జరిపిన పర్యటనలో పాల్గొన్న మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకు షాక్ తలిగింది. చంద్రబాబు పర్యటనలో ఆయన వెంట సూర్యారావు బిజీగా ఉండగా… సూర్యారావు జేబులో ఉన్న పర్సును దొంగలు కొట్టేశారు. పర్సులో రూ.35 వేల నగదుతో పాటు 2 ఏటీఎం కార్డులు కూడా ఉన్నాయట. చంద్రబాబు పర్యటన ముగిశాక తీరా తన జేబులో చేయి పెడితే.. అందులో పర్సు లేని విషయాన్ని గుర్తించిన సూర్యారావు షాక్ తిన్నారు. ఆ వెంటనే తేరుకుని ఆయన నేరుగా రాజోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.