ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బాటలో మాజీ ఐఏఎస్ కొత్త పార్టీ

తెలంగాణ లో కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే వైఎస్ షర్మిల వైఎస్సార్‌టీపీ పేరుతో కొత్త పార్టీ స్థాపించి కేసీఆర్‌కు వ్యతిరేకంగా గళం విప్పుతోన్నారు. ప్రజాప్రస్థానం పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళుతున్నారు. ఇక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన ఐపీఎస్ పదవికి రాజీనామా చేసి కేసీఆర్ సర్కార్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తోన్నారు. ఇక ఇప్పుడు మరో మాజీ ఐఏఎస్ అధికారి కేసీఆర్ కు వ్యతిరేకంగా కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.

మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి తెలంగాణలో కొత్త పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించారు. మాజీ అధికారులు, మేధావులతో కలిసి కొత్త పార్టీ స్థాపించబోతున్నానని, త్వరలోనే పార్టీకి సంబదించిన వివరాలను వెల్లడిస్తానని తెలిపారు. తాజాగా కొత్తగూడెంలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో రాజకీయం వ్యాపారంగా మారిపోయిందని, ఆదర్శ రాజకీయాలను మళ్లీ తెలంగాణ ప్రజలకు అందించేందుకు త్వరలో నూతన రాజకీయ పార్టీని ఏర్పాట్లు చేయబోతున్నట్లు స్పష్టం చేశారు.

గతంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌గా, స్టేట్ ఆర్కివ్స్ సంచాలకుడిగా ఆకునూరి మురళి పనిచేశారు. పదవీకాలం మిగిలి ఉండగానే వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకున్నారు. ఆ తర్వాత ఏపీలోని జగన్ ప్రభుత్వంలో విద్యాశాఖలో మౌలిక సదుపాయాల సలహాదారులుగా మురళి పనిచేశారు. కొంతకాలం తర్వాత ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేసిన ఆకునూరి మురళి.. తన సొంత రాష్ట్రమైన తెలంగాణలో ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తోన్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలతో వార్తల్లో నిలుస్తున్నారు.