ప్రతి పాఠశాలలో ‘నీటిగంట’ అవసరం

నిత్య జీవితంలో నీరు లేనిదే జీవితమే లేదు. నీరే మనిషికి ప్రాణాధారం. నీటి ప్రాధాన్యత,అవసరం మనకు తెలియందికాదు. మన శరీరంలో ఎక్కువ భాగం నీరు ఉంటుందన్న సంగతి తెలిసిందే. పిల్లలు కనీసం రోజుకు రెండు నుంచి మూడు లీటర్ల నీటిని తాగాల్సి ఉంటుందని వైద్యులు పేర్కొంటున్నారు.

children drinking water in class room

కానీ పాఠశాలల్లో అధికశాతం మంది విద్యా ర్థులు రోజుకు అర లీటరు నీటిని కూడా సరిగ్గా తాగడం లేదు. నీటిని తగిన రీతిలో తాగాలన్న అవగాహన లేకపోవడం, పాఠ శాలల్లో ఎక్కువగా నీరు తాగితే తరచూ మరుగుదొడ్లకు వెళ్లాల్సి వస్తుందన్న బెంగ, ఎడతెరపి లేకుండా తరగతుల నిర్వహణ, అసలు మరుగుదొడ్లే అందుబాటులో లేకపోవడం.

ఉన్నా అవి శుభ్రంగా లేకపోవడం, ఉన్నా సరైన నీటి వసతి లేకపోవడం వంటి సమస్యలతో పిల్లలు ఎక్కువగా నీటిని తాగలేకపో తున్నారు. దీంతో వారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని విద్యార్థుల్లో డీహైడ్రేషన్‌ సమస్యను అధిగమించేందుకు కేరళ రాష్ట్రంలోని చెరువత్తూరు, వలియ పరంబు గ్రామ పంచాయతీల పరిధిలోని పాఠశాలల్లో ప్రత్యే కంగా ‘నీటి గంట ఏర్పాటు చేశారు. అక్కడ ప్రతి మూడు గంటలకు ఒకసారి గంటను మోగిస్తున్నారు.

ఆ సమయంలో విద్యార్థులు నీరు తాగేలా ఉపాధ్యాయులు ప్రోత్సహిస్తారు. నీటి గంట సమయంలో తగిన మోతాదులో వారు నీటిని తాగేటట్లు చూస్తున్నారు. తద్వారా విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తోంది.

ఇదే స్ఫుర్తితో కర్ణాటక, తమిళ నాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలలో ఇటువంటి కార్యక్ర మాన్ని అమలుచేయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. దానికి తగ్గట్లు చర్యలు తీసుకుంటున్నారు. దీని మూలాల్లోకి వెళితే అధికశాతం పాఠశాల విద్యార్థులు సరిపడా నీరు తాగడం లేదు. దీనివల్ల వారు పలు వ్యాధుల బారినపడుతున్నారు.

పాఠశాలల్లో తాగునీటి సదుపాయం ఉన్నా, ఇళ్ల నుంచి సీసాల్లో నీటిని తీసుకెళ్లినా, పరిస్థితిలో మాత్రం మార్పు ఉండటం లేదు. దీంతో పిల్లలు త్వరితగతిన నీరసపడుతున్నట్లు వైద్యనిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం అన్ని పాఠశాలల్లో రక్షిత మంచినీటి వసతి కల్పించాలి.

అలాగే వాటి మరమ్మతులు, నిర్వహణ బాధ్యతలు పంచాయతీరాజ్‌, గ్రామీణ నీటి సరఫరా శాఖలకు కేటాయించి వాటి పర్యవేక్షణ బాధ్యత చేపట్టాలి. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరుగుదొడ్లు నిర్మించాలి. వాటి పర్యవే క్షణకు సిబ్బందిని కేటాయిస్తూ భారీగా నిధులు విడుదల చేసి వాటిని ఎప్పటికప్పుడు శుభ్రపరిచేలా చర్యలు తీసుకోవాలి.

-కాళం రాజువేణుగోపాల్‌

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/