బిజెపి అధిష్టానం ఈటల రాజేందర్ కు కీలక పదవి ఇవ్వబోతుందా..?

హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు బిజెపి అధిష్టానం కీలక పదవి ఇవ్వబోతుందా..? ప్రస్తుతం బిజెపి పార్టీ లో ఇదే చర్చ జరుగుతుంది. తెలంగాణలో ఎట్టిపరిస్థితుల్లోనే కషాయ జెండా ఎగరాలని భావిస్తున్న బీజేపీ పెద్దలు.. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించారని తెలుస్తోంది. ఒక్కొక్కటిగా అమలు చేస్తూ కేడర్ లో జోష్ నింపుతున్నారు. ఇటీవలే తెలంగాణకు చెందిన బీజేపీ నేత లక్ష్మణ్ ను యూపీ నుంచి రాజ్యసభకు పంపించింది బీజేపీ. తాజాగా తెలంగాణకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.

హుజురాబాద్ లో విజయం సాధించి కేసీఆర్ కు దిమ్మతిరిగే షాకిచ్చిన ఈటల రాజేందర్ కు బీజేపీ పెద్దలు కీలక పదవి ఇచ్చే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షాతో ఢిల్లీలో ఆదివారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు రాజేందర్. దాదాపు 30 నిమిషాల పాటు చర్చించారు. అమిత్ షా నుంచి కాల్ రావడంతో ఆదివారం హడావుడిగా ఢిల్లీ వెళ్లారు రాజేందర్. ఏనుగు రవీందర్ రెడ్డితో కలిసి అమిత్ షాను కలిశారు. తెలంగాణ లోని తాజా పరిస్థితులను అమిత్ షాకు వివరించారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలకు సంబంధించి కూడా అమిత్ దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణలో నిరంకుశ పాలన నడుస్తోందని చెప్పారు. అలాగే రాష్ట్రంలో పర్యటించాలని అమిత్ షాను ఈటల రాజేందర్ కోరినట్లు తెలుస్తోంది. ఇందుకు అమిత్ షా సానుకూలంగా స్పందించారని.. తెలంగాణకు సమయం కేటాయిస్తానని ఈటలకు చెప్పినట్లు సమాచారం.

తెలంగాణలో బలమైన నేతగా ఉన్న రాజేందర్ కు కీలక బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్న బీజేపీ హైకమాండ్… అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టిందని తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ ప్రచార బాధ్యతలు ఈటలకు అప్పగించనున్నారని తెలుస్తోంది. దీనిపై ఈటలతో మాట్లాడిన అమిత్ షా.. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాని సూచించినట్లు తెలుస్తోంది. ఈటలకు పదవిపై త్వరలోనే అధికారిక ప్రకటన రావచ్చని చెబుతున్నారు. హైదరాబాద్ లో జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ముందే ఈటలకు పదవిపై ప్రకటన వస్తుందని సమాచారం. తెలంగాణలోని హైదరాబాద్‎లో జూలై 2,3 తేదీల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు 300 మందికి పైగా బీజేపీ నేతలు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ నేతలు కూడా జాతీయ కార్యవర్గ సమావేశాలకు సమయత్తమవుతున్నారు. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ఈ సమావేశాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్ రావు తో పాటు డీకే అరుణ , విజయశాంతి, తదితర నేతలు.. హైదరాబాద్ వచ్చే బీజేపీ నేతలకు ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.