ఓడిపోతామనే భయంతోనే ఇలాంటి పనులు:ఈటల

పాదయాత్రకు అనుమతులు తీసుకున్నా అడ్డంకులు సృష్టిస్తున్నారు: ఈటల రాజేందర్

హైదరాబాద్ : మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన పాదయాత్రను ప్రారంభించారు. హుజూరాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండలం బత్తినివానిపల్లి నుంచి ప్రజా జీవనయాత్ర పేరుతో పాదయాత్రను ఆరంభించారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తలు, అనుచరులు ఆయనతో పాటు పాదయాత్రలో పాల్గొన్నారు. పాదయాత్ర ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార టీఆర్ఎస్ పార్టీపై నిప్పులు చెరిగారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం గూండాగిరి చేస్తోందని ఈటల మండిపడ్డారు. పాదయాత్రకు అనుమతులు తీసుకున్నప్పటికీ అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భోజన విరామం కోసం బుక్ చేసుకున్న రైస్ మిల్లును సీజ్ చేశారని మండిపడ్డారు. ఓడిపోతామనే భయంతోనే ఇలాంటి పనులు చేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నీచమైన సంస్కృతికి ఇలాంటి ఘటనలు నిదర్శనాలని చెప్పారు. కేసీఆర్ నియంతృత్వ పోకడలకు, అహంకారపు పాలనకు ఈ పాదయాత్ర నుంచే చరమగీతం పాడుతామని అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/