హుజురాబాద్ ఉప ఎన్నిక తేదీ వచ్చింది..మళ్లీ నేతల నోటికి పనిపడింది
హుజురాబాద్ ఉప ఎన్నికల షెడ్యూల్ వచ్చిందో రాలేదో..మళ్లీ నేతలు వారి నోటికి పనిచెప్పడం స్టార్ట్ చేసారు. మొన్నటి వరకు కాస్త సైలెంట్ గా ఉన్న మాజీ మంత్రి ఈటెల రాజేందర్..కేసీఆర్ సర్కార్ ఫై నిప్పులు చెరిగారు. ఉప ఎన్నిక కోసం కేసీఆర్ నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
నీచులు.. పరమ నీచులు నీచ రాజకీయం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ ఎలాంటి ప్రలోభాలకు గురిచేసినా హుజూరాబాద్ ప్రజలు ఈటలను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని.. మహిళలు, యువకులు, పెద్దలు అందరూ తన వెంటే ఉన్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇది కేసీఆర్ అహంకారానికి.. హుజూరాబాద్ ప్రజల ఆత్మగౌరవానికి జరుగుతున్న పోటీ అని ఈటెల అన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణలోని హుజురాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేల్ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 30న ఈ రెండు నియోజక వర్గాలకు ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. నవంబర్ 2న కౌంటింగ్ చేపట్టనున్నట్లు పేర్కొంది.