కేసీఆర్ చిల్లర వ్యవహారాలు చేస్తున్నారు : ఈటల రాజేందర్

కేసీఆర్ గురువింద గింజ.. మోడీతో ఈయనకు పోలికేంటి?: ఈటల రాజేందర్

హైదరాబాద్: ప్రధాని మోడీ ని విమర్శించవద్దని గతంలో చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్… ఇప్పుడు అదే ప్రధానిపై నీచంగా మాట్లాడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. 1985 నుంచి ఇప్పటి వరకు ఓడిపోని కేసీఆర్ కు… ఇప్పుడు ప్రశాంత్ కిశోర్ అవసరం ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. కేసీఆర్ కుట్రలు, కుతంత్రాలు ప్రజలకు అర్థమైపోయాయని… అందుకే పీకేను తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. పీకే కన్నా పెద్ద మేధావులు తెలంగాణలో ఉన్నారని అన్నారు. దుబ్బాకలో, హుజూరాబాద్ ఎన్నికల్లో బీజేపీ గెలిచిందని చెప్పారు. రజకులకు, నాయీబ్రాహ్మణులకు ఇచ్చే సబ్సిడీ ఎందుకు ఆగిపోయిందని ప్రశ్నించారు. ఇంత చిల్లర వ్యవహారాలు ఎందుకు చేస్తున్నారు ముఖ్యమంత్రిగారూ అని అడిగారు.

దళిత బస్తీల్లో కరెంట్ ఎందుకు కట్ చేస్తున్నారని ప్రశ్నించారు. రైతుల ధాన్యం విషయంలో కేసీఆర్ ఇప్పటికే అభాసుపాలయ్యారని… ఇప్పుడు కూడా రజకులు, నాయీ బ్రాహ్మణులు, వ్యవసాయ మీటర్ల విషయంలో అభాసుపాలవుతారని చెప్పారు. కేసీఆర్ ఒక గురువింద గింజ అని విమర్శించారు. మోదీతో కేసీఆర్ కు పోలికేంటని ఎద్దేవా చేశారు. రాష్ట్ర మంత్రులను, ఎమ్మెల్యేలను కేసీఆర్ జీవచ్ఛవాల్లా మార్చారని దుయ్యబట్టారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/