కెసిఆర్ ను గద్దె దింపేంత వరకు విశ్రమించనుః ఈటల రాజేందర్

ఏడాది కాలంగా తనపై కుట్రలు చేస్తున్నారన్న ఈటల

etela-rajender-comments-on-kcr

హైదరాబాద్ః అసెంబ్లీ నుంచి బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సెషన్ చివరి వరకు ఆయనపై సస్పెన్షన్ అమల్లో ఉంటుందని స్పీకర్ పోచారం తెలిపారు. అనంతరం సభ నుంచి బయటకు వచ్చిన ఈటలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులతో ఈటల వాగ్వాదానికి దిగారు. పోలీసు వాహనం ఎక్కేందుకు ఆయన నిరాకరించారు. తన సొంత వాహనంలోనే వెళ్తానని చెప్పారు. అయినప్పటికీ.. పోలీసులు ఆయనను బలవంతంగా వాహనం ఎక్కించి శామీర్ పేటలోని ఆయన నివాసం వద్ద వదిలిపెట్టారు. ఈ సందర్భంగా పోలీసులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బానిసల మాదిరి బతకొద్దని అన్నారు.

మరోవైపు, కెసిఆర్ పై ఈటల మండిపడ్డారు. ఆయన నాశనానికే ఇందంతా చేస్తున్నారని అన్నారు. ఏడాది కాలంగా తనపై కుట్రలు చేస్తున్నారని… ఎమ్మెల్యేగా మళ్లీ గెలిచినప్పటి నుంచి తనను అసెంబ్లీలోకి రానివ్వకుండా ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. తన గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని.. కెసిఆర్ ను గద్దె దింపేంత వరకు విశ్రమించబోనని అన్నారు. కెసిఆర్ తాటాకు చప్పుళ్లకు భయపడనని వ్యాఖ్యానించారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/