జనానికి కరోనా భయం లేదు: ఈటెల

ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని పలు దేశాల ప్రభుత్వాలు కోరుతున్నాయి. ఇటు భారత్‌లోనూ కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. అయితే తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ అంత వేగంగా వ్యాప్తి చెందడం లేదని ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. తాజాగా ఆయన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో పేదలు ప్రైవేట్ ఆసుపత్రులకు వస్తే, వారి నుండి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేయకూడదని ఈటెల కోరారు. కరోనా కారణంగా చాలా మంది ఆర్ధికమాంద్యంలోకి వెళ్లారని, ముఖ్యంగా నిరుపేదలు వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రికి రావాలంటే భయపడే పరిస్థితి నెలకొందని ఆయన అన్నారు. ఇలాంటి భయాందోళనలు ప్రజల నుండి దూరం చేసే బాధ్యత ఆయా ఆసుపత్రులపై ఉందని ఆయన తెలిపారు.

అయితే ప్రస్తుతం కరోనా భయం జనంలో పెద్దగా లేదని ఈటెల కామెంట్ చేశారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో కోవిడ్ ట్రీట్‌మెంట్‌తో పాటు నాన్-కోవిడ్ ట్రీట్‌మెంట్ కూడా తక్కువ ధరకు అందించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా వైద్యానికి ప్రభుత్వమే ఫీజులను ఖరారు చేసిందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. కరోనా నుండి ప్రజలు తమను తాము రక్షించుకోవాలని, తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఆయన కోరారు.