వేల కోట్ల రూపాయలను మునుగోడులో డంప్ చేసారంటూ కేసీఆర్ ఫై ఈటెల ఆరోపణ

మునుగోడు లో గెలిచేందుకు టిఆర్ఎస్ పార్టీ అడ్డదారులు తొక్కుతుందని , పోలీసులు, డబ్బును నమ్ముకుని గెలవాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నాడని..ఇందులో భాగంగానే వేల కోట్ల రూపాయలను మునుగోడులో డంప్ చేశారని ఈటెల ఆరోపించారు. టీఆర్ఎస్ ఎంత భయపెట్టినా స్థానిక నేతలు కట్టలు తెంచుకుని కాషాయ కండువా కప్పుకుంటారని తేల్చి చెప్పారు.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం తో మునుగోడు లో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో టిఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ లు ఎలాగైనా ఉప ఎన్నికలో గెలిచి తీరాలని సన్నాహాలు చేస్తూ..ఎవరికీ వారే గెలుపు ఫై ధీమా వ్యక్తం చేస్తున్నారు. రేపు టిఆర్ఎస్ భారీ సభ నిర్వహిస్తుండగా..ఎల్లుండి బిజెపి సభ నిర్వహించబోతుంది. మరోపక్క కాంగ్రెస్ పార్టీ సైతం సమావేశాలు , ప్రచారంలో మునిగిపోయింది.

ఈ నెల 21 న బిజెపి సభ ఏర్పటు చేస్తున్నట్లు కొద్దీ రోజుల క్రితమే ప్రకటించగా..తాజాగా టిఆర్ఎస్ రేపు సభ నిర్వహించబోతున్నట్లు తెలిపి షాక్ ఇచ్చారు. బీజేపీ సభకు అడ్డంకులు సృష్టించేందుకే ఆగమేఘాల మీద మునుగోడులో సీఎం సభ ఏర్పాటు చేశారని బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఆరోపించారు. టీఆర్ఎస్ సర్కారు ఎన్ని ప్రయత్నాలు చేసినా, కేసీఆర్ పార్టీని ఓడించాలని మునుగోడు ప్రజలు నిర్ణయించుకున్నారని ఈటల స్పష్టం చేశారు.

ఎంపీలు, ఎమ్మెల్యేల నుంచి జిల్లా పరిషత్ ఛైర్మన్ల వరకు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఈటల రాజేందర్ అన్నారు. పోలీసులు, డబ్బును నమ్ముకుని మునుగోడు ఉప ఎన్నికలో గెలవాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నాడని ఈటల విమర్శించారు. ఇందులో భాగంగానే వేల కోట్ల రూపాయలను మునుగోడులో డంప్ చేశారని చెప్పారు. టీఆర్ఎస్ ఎంత భయపెట్టినా స్థానిక నేతలు కట్టలు తెంచుకుని కాషాయ కండువా కప్పుకుంటారని చెప్పారు. టీఆర్ఎస్ నేతల అక్రమాలకు పోలీసు అధికారులు సహకరిస్తున్నారని ఈటల ఆరోపించారు.