తెలంగాణ బీజేపీ సీఎం అభ్యర్థి విషయంలో ఈటల ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బిజెపి vs టిఆర్ఎస్ గా మారింది. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని బిజెపి సన్నాహాలు చేస్తుంది. ఈటల రాజేందర్ కు చేరికల కమిటీ కన్వీనర్ గా బాధ్యతలు అప్పగించిన బిజెపి.. టిఆర్ఎస్ పార్టీ నుండి కీలక నేతలను బిజెపిలోకి తీసుకురావడానికి ఆపరేషన్ మొదలుపెట్టింది. ఇప్పటీకే టిఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీల నుండి కీలక నేతలు బిజెపిలోకి చేరగా..మరికొంతమంది రాబోయే రోజుల్లో చేరబోతున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటె గత కొద్దీ రోజులుగా తెలంగాణ బీజేపీ సీఎం అభ్యర్థి ఫై చర్చ కొనసాగుతుంది. బండి సంజయ్ , ఈటెల , రఘునందన్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

ఈ తరుణంలో బీజేపీ సీఎం అభ్యర్థి విషయంలో ఈటల ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. తాను ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ వస్తున్న కథనాలను ఈటల రాజేందర్ ఖండించారు. ఆ వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. బిజెపి క్రమశిక్షణకు పెద్దపీట వేసే పార్టీ అని, పార్టీ లో ఉన్న నాయకులు, కార్యకర్తలు పార్టీ నియమ, నిబంధనలకు కట్టుబడి ఉంటారని స్పష్టం చేశారు. నేతల సామర్థ్యాన్ని గురించి సరైన నిర్ణయం తీసుకుంటారని, సీఎం అభ్యర్థి ఎవరన్నది అధిష్టానం నిర్ణయిస్తుందని ఈటల రాజేందర్ వెల్లడించారు.

ఇక ప్రజా సంగ్రామ యాత్రలో ఉన్న బండి సంజయ్ టిఆర్ఎస్ పార్టీ ఫై పలు కామెంట్స్ చేసారు. రానున్న శాసనసభ ఎన్నికలలో పోటీ చేయడానికి టిఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు కరువవుతారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ బొమ్మతో ఎన్నికలకు వెళితే నిండా మునిగిపోతామనే భయం ఆ పార్టీ ఎమ్మెల్యేలకు పట్టుకుందని బండి సంజయ్ పేర్కొన్నారు. ప్రస్తుతం బీజేపీలో చేరే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువగా ఉందని బండి సంజయ్ తెలిపారు.