సీపీఐ, సీపీఎం నాయకులతో మంత్రి ఎర్రబెల్లి భేటీ

టిఆర్ఎస్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు..బుధువారం సీపీఐ, సీపీఎం నాయకులతో భేటీ అయ్యారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా చండూరులో ప్రచారం నిర్వహిస్తున్న ఎర్రబెల్లికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు నేతృత్వంలో కొనసాగుతున్న ప్రచార బృందం ఎదురుపడింది. దీంతో ఇరువురు కలుసుకుని కొద్దిసేపు ముచ్చటించారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి మరింత తీసుకెళ్లాలని వారికి సూచించారు. బీజేపీ రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాలను ప్రజలకు వివరించి ఈ ఎన్నికల్లో వారికి గట్టి బుద్ధి చెప్పేలా ఓటర్లను చైతన్య పరచాలని సూచించారు. ఈ సందర్భంగా చండూరుకు చెందిన సీనియర్ నాయకులు జోగి సంతోశ్‌, గుంటి మల్లేశ్‌ టీఆర్‌ఎస్ లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

మునుగోడు ఉప ఎన్నిక ప్రచార సమయం ముగుస్తుండడంతో అన్ని పార్టీల ప్రధాన నేతలు మునుగోడు లో ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నారు. అధికార పార్టీ టిఆర్ఎస్ అధినేత , ముఖ్యమంత్రి కేసీఆర్..మునుగోడు లో లక్ష మందితో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఈనెల 30న చండూరులో కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఈ సభకు ఏకంగా లక్ష మంది వస్తారని సమాచారం. టిఆర్ఎస్ నేతలు ఇప్పటికే కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లలో మునిగిపోయారు. ఆ తర్వాత రోజే జేపీ నడ్డా రానుండటంతో మునుగోడు ఉప ఎన్నికల హీట్ మరింత పెరిగే అవకాశం ఉంది. కేసీఆర్ చేసే విమర్శలకు నడ్డా కౌంటర్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.