‘బలగం’ సింగర్‌ మొగిలయ్యను పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి

‘బలగం’ సింగర్‌ మొగిలయ్యను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు. ‘బలగం’ సినిమాలో క్లైమాక్స్ లో వచ్చే ‘తోడుగా మా తోడుండి’ అనే పాట ప్రతీ ఒక్కరిని కన్నీరుపెట్టిస్తుంది. ఈ పాటే సినిమాకు ప్రధాన హైలెట్ గా నిలిచిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతి ఒక్కరి గుండెను మెలిపెట్టి కన్నీళ్లు తెప్పిస్తుంది. అయితే ఆ పాట పాడిన గాయకుడు మొగిలయ్య ఆరోగ్య పరిస్థితి చాల దారుణంగా ఉంది. కరోనా తర్వాత ఈయన రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. సినిమా తర్వాత కళ్లు కూడా కనిపించట్లేదు. వైద్యం చేయించుకునేందుకు మొగిలయ్య ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే. షుగర్, బీపీ వల్ల వైద్యం చేయడం క్రిటికల్ గా మారింది. ఇప్పటికే 10 ఆపరేషన్లు జరిగాయి. దీంతో మొగిలయ్య పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ఈ తరుణంలో తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చి..నిమ్స్ లో ఆయనకు ప్రభుత్వం చికిత్స చేయిస్తుంది. ఇప్పటికే పలువురు నేతలు ఆయన్ను పరామర్శించి , తగిన ఆర్ధిక సాయం అందజేస్తున్నారు.

ఈ తరుణంలో మొగిలయ్యను మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పరామర్శించారు. నిమ్స్‌కు వెళ్లిన ఎర్రబెల్లి.. మొగిలయ్య ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మొగిలయ్యకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు మంత్రి ఆదేశాలిచ్చారు. కాగా మొగిలయ్య వైద్యానికి అయ్యే ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని దయాకర్‌రావు కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. మంత్రి ఎర్రబెల్లితో పాటు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌ కుమార్‌ నిమ్స్‌లో మొగిలయ్యను పరామర్శించారు.