వృద్దరాలి కష్టాలు విని కన్నీరు పెట్టుకున్న మంత్రి దయాకర్ రావు

వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు..ఓ వృద్దరాలి కష్టాలు విని కన్నీరు పెట్టుకున్నారు. వృద్ధురాలి రోదనలు చూసిన ఎర్రబెల్లి చలించి పోయి దగ్గరకు తీసుకొని ఓదార్చాడు. ప్రభుత్వ పరంగా ఆమెకు అందాల్సిన సంక్షేమ పథకాలను అందేలా చూడాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా సొంత ఖర్చులతో వైద్య సేవలు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఒక మంత్రి తన దగ్గరికి వచ్చి తన గోడు విని సహాయ పడతానని చెప్పడంతో ఆ వృద్ధురాలు కంట నీరు కారుస్తూ ఉప్పొంగి పోయి మంత్రి ఎర్రబెల్లిని ఆశీర్వదించింది.

ఇక పర్యటన లో ఎర్రబెల్లి కాంగ్రెస్ , బిజెపి పార్టీల ఫై నిప్పులు చెరిగారు. కిరికిరి చేష్టలు, బోగస్ మాటలు, కల్లబొల్లి కబుర్లు చెప్పి కాంగ్రెస్ 50 ఏళ్లు దేశాన్ని పాలించిందని దయాకర్ రావు మండిపడ్డారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చి చేసింది ఏమీ లేదని ఆయన పేర్కొన్నారు. అబద్ధాలు చెప్పి అధికారంలో ఉంటున్నదని బీజేపీపై ధ్వజమెత్తారు. బిజెపి, కాంగ్రెస్ ఈ రెండు పార్టీలతో ఊదు కాలదు… పీరు లేవదు అంటూ మంత్రి మండిపడ్డారు. ఆ రెండు పార్టీలను నమ్ముకుంటే నట్టేట మునిగినట్లేనని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభిప్రాయం వ్యక్తం చేశారు.