ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌

Encounter
Encounter

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌

ముగ్గురు మావోల మృతి-పలువురికిగాయాలు

భద్రాద్రి కొత్తగూడెం: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం ,సుకుమా జిల్లా మార్చెగుడ- బుళ్ళార్‌ అటవీ ప్రాంతంలో పోలీసులకు,మావోలకు జరిగిన ఎదురుకాల్పులలో ముగ్గురు మావోలు మృతి చెందగా ,పలువురు మావోలు గాయపడ్డారు. మంగళవారం అర్ధరాత్రి ఈ ఎన్‌కౌంటర్‌ జరిగిందని తెలిసింది. ఆంధ్ర రాష్ట్రానికి చెందిన అధికార పార్టీ శాసనసభ్యుడు కిడారి .సర్వేశ్వరరావు ,మాజీ ఎమ్మెల్యే సోమ లను మావోలు హత్య చేసిన నాటి నుండి అటు ఏవోబి తో పాటు ,ఇటు తెలంగాణా ,ఛత్తీష్‌ఘడ్‌ సరిహద్దు అటవీ ప్రాంతాల్లో భారీగా కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. అడవులను జల్లెడ పట్టే నేపథ్యంలో బలగాలను హెలీకాఫ్టర్‌ల ద్వారా తరలిస్తున్నారు. అయితే మంగళవారం రాత్రి సిఆర్‌పిఎఫ్‌ సిబ్బంది కూంబింగ్‌ నిర్వహిస్తుండగా మావోలు తారసపడటంతో ఒకరిపై ఒకరు ఎదురు కాల్పులకు దిగినట్లు తెలిసింది.సుమారు 10మందికి పైగా మావోలు ఈ సంఘటనలో పాల్గొని ఉంటారని పోలీసు అధికారులు భావిస్తున్నారు.కాల్పుల అనంతరం సంఘటన ప్రాంతాన్ని సిఆర్‌పిఎఫ్‌ సిబ్బంది గాలించగా ముగ్గురు మావోల మృతదేహాలతో పాటు పలు ఆయుధాలు లభ్యమయ్యాయి. లభ్యమైన ఆయుధాలు , విప్లవ సాహిత్యాన్ని బట్టి 10మందికి పైగా మావోలు ఈ సంఘటనలో పాల్గొని ఉంటారని ,మిగతా మావోలు గాయాలతో పారిపోయి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. పారిపోయిన మావోల కోసం సిఆర్‌పిఎఫ్‌ గ్రేహౌన్స్‌ బలగాలు అడవులను జల్లెడ పడుతూ అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. దీనిలో భాగంగా చర్ల,వెంకటాపురం, వాజేడు ,దుమ్ముగూడెం, భద్రాచలం శివారులలో వాహన తనిఖీలు చేపడుతున్నారు.మొన్న బెర్జి ప్రాంతానికి చెందిన ఒక విద్యార్ధిని మావోలు కిడ్నాప్‌ చేయడంతో , కుంట ప్రాంతానికి చెందిన కొందరు విద్యార్ధులు మావోలకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించినట్లు తెలిసింది.దీంతో సరిహద్దులోని గిరిజన గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతున్నారు.