ఉక్రెయిన్‌లో ఆకస్మికంగా పర్యటించిన అధ్యక్షుడు జో బైడెన్

జెలెన్ స్కీతో భేటీ.. 500 మిలియన్ డాలర్ల మిలిటరీ సాయంపై ప్రకటన

us-president-joe-biden-makes-surprise-visit-to-kyiv

కివ్‌ః అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ఉక్రెయిన్ లో ఆకస్మికంగా పర్యటించారు. ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్య మొదలైన తర్వాత తొలిసారిగా అక్కడికి వెళ్లారు. రెండు దేశాల మధ్య యుద్ధం మొదలై ఏడాది కావస్తున్న సమయంలో బైడెన్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. సోమవారం ఉక్రెయిన్ రాజధాని కీవ్ కు బైడెన్ చేరుకున్నారు. పోలండ్ అధ్యక్షుడు ఆండ్రేజ్ డుడాతో సమావేశమయ్యేందుకు వెళ్తూ.. మధ్యలో కీవ్ లో ల్యాండ్ అయ్యారు.

నిజానికి సోమవారం ఉదయాన్నే కీవ్ సహా దేశవ్యాప్తంగా అధికారులు ఎయిర్ అలర్ట్ జారీ చేశారు. దీంతో ఎవరో కీలక నేత పర్యటించబోతున్నారని వార్తలు వచ్చాయి. ముఖ్యంగా రాజధాని నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో బైడెన్ చర్చలు జరిపారు. సుమారు 500 మిలియన్ డాలర్ల మిలిటరీ సహాయ ప్యాకేజీని ఉక్రెయిన్ కు అందజేయనున్నట్లు బైడెన్ ఈ సందర్భంగా తెలిపారు. సుదీర్ఘ శ్రేణి ఆయుధాలపై తాము చర్చించినట్లు జెలెన్ స్కీ వెల్లడించారు.

బైడెన్‌తో షేక్‌హ్యాండ్ ఇస్తున్న ఫోటోను ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీ త‌న టెలిగ్రామ్ అకౌంట్‌లో పోస్టు చేశారు. కొన్ని క్ష‌ణాల క్రిత‌మే ఆయ‌న ఆ ఫోటో షేర్ చేశారు. బైడెన్‌.. వెల్క‌మ్ టు కీవ్ అని తెలిపారు. ఉక్రేనియ‌న్ల మ‌ద్ద‌తుకు మీ రాక చాలా అవ‌స‌ర‌మ‌ని జెలెన్‌స్కీ తెలిపారు.