ప్లాస్టిక్‌ ప్రపంచంలో ఉపాధి

ప్లాస్టిక్‌ ప్రపంచంలో ఉపాధి

ప్రతిరోజూ ప్లాస్టిక్‌తోనే ప్రారంభమవుతుంది. ముగుస్తుంది. అంతగా అందరి జీవితాలతో అనుబంధాన్ని పెనవేసుకుంది ప్లాస్టిక్‌ ఎందుకంటే దాదాపు అన్ని వస్తువులూ దాంతోనే తయారవుతున్నాయి. ఆకర్షించే ఆకృతులు, అవసరాలకు అనుకూతమైన రూపాలతో అందుబాటు ధరల్లో లభించడం వీటి ప్రత్యేకత. ఈ వస్తువుల తయారీలో ఎంతోమంది నిపుణులు నిమగ్నమై ఉంటారు. అలాంటి నైపుణ్యాలను, కొలువులను అందుకోవాలంటే కొన్ని కోర్సులు చేయాలి.

లోహాలతో పోల్చుకుంటే ఎందులోనైనా ఇమిడిపోయి, కోరుకున్న రూపాన్ని సంతరించుకోవడం ప్లాస్టిక్‌ ప్రత్యేకత. తక్కువ ఖర్చులో, తేలికగా, ఆకర్షణీయంగా, సౌకర్యవంతంగా దీన్ని వినియోగించు కోవచ్చు. అందువల్ల పరిశ్రమలన్నీ తమ ఉత్పత్తుల్లో ప్లాస్టిక్‌ని పెద్ద మొత్తంలో ఉపయోగిస్తున్నాయి. ఇందుకోసం ఈ విభాగంలో నైపుణ్యమున్నవారి సేవలు కీలకమవుతున్నాయి. ప్లాస్టిక్‌, అనుబంధ విభాగాల్లో సమర్ధమానవ వనరులను పరిశ్రమలకు అందించే లక్ష్యంతో సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్టిక్స్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (సిపెట్‌) కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో చెన్నైలో ఏర్పాటైంది. ఇక్కడ డిప్లొమా, పోస్టు డిప్లొమా, పోస్టుగ్రాడ్యుయేట్‌ డిప్లొమా కోర్సులు అందిస్తున్నారు.

ఈ కోర్సుల్లో చేరాలంటే దేశవ్యాప్తంగా 27 కేంద్రాల్లో నిర్వహించే సిపెట్‌-జెఇఇ రాయాల్సి వుంటుంది. తెలుగురాష్ట్రాల్లో హైదరాబాద్‌, విజయవాడల్లో సిపెట్‌లు ఉన్నాయి. పరీక్షల్లో చూపిన ప్రతిభతో ప్రవేశాలుంటాయి. వీటిని పూర్తి చేసుకున్నవారు క్యాంపస్‌ నియామకాల ద్వారా మేటి సంస్థల్లో ఉద్యోగాల సొంతం చేసుకుంటున్నారు.

మిల్టన్‌, సెలో, ఎల్‌అండ్‌టీ, మారుతీ సుజుకీ, ఓఎన్‌జిసి, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఆదానీ, గోద్రెజ్‌, అరవింద్‌ తదితర సంస్థలు వీరిని నియమించుకుంటున్నాయి. ఆటోమోటివ్‌, ప్యాకేజింగ్‌, కన్స్యూమర్‌ గూడ్స్‌, మెషిన్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ అర్‌ అండ్‌ డీ, సాఫ్ట్‌వేర్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ తదితర విభాగాలకు చెందిన సంస్థలన్నింటికీ ప్లాస్టిక్‌పై పట్టున్నవారి సేవలు కీలకం. అందువల్ల ఈ కోర్సులు చదివినవారి ఉపాధికి డోకాలేదనే చెప్పాలి.

ప్రవేశం లభించే కోర్సులు:

పోస్టుగ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ ప్లాస్టిక్స్‌ ప్రాసెసింగ్‌ అండ్‌ టెస్టింగ్‌ (పిజిడి-పిపిటి) వ్యవధి: రెంళ్లు. అర్హత: ఏదైనా సైన్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టు డిప్లొమా ఇన్‌ ప్లాస్టిక్స్‌ మౌల్డ్‌ డిజైన్‌ పిడిపిఎండి (క్యాడ్‌/క్యామ్‌) వ్యవధి: 18 నెలలు. అర్హత: నిర్దేశిత విభాగాల్లో డిప్లొమా ఉత్తీర్ణత. డిప్లొమా ఇన్‌ ప్లాస్టిక్స్‌ మౌల్డ్‌ టెక్నాలజీ, వ్యవధి మూడేళ్లు. అర్హత. పదోతరగతి ఉత్తీర్ణత డిప్లొమా ఇన్‌ ప్లాస్టిక్స్‌ టెక్నాలజీ. వ్యవధి మూడేళ్లు అర్హత. పదో తరగతి ఉత్తీర్ణత ఈ కోర్సులకు ప్రస్తుతం విద్యార్హతకు సంబంధించి ఆఖరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష వ్యవధి గంట. ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/