ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడికి ఏడాదిపాటు జైలు శిక్ష

2012 ఎన్నికల్లో ప్రచారం కోసం పరిమితికి మించి ఖర్చు చేసిన సర్కోజీ

పారిస్: ఎన్నికల్లో పరిమితికి మించి ఖర్చు చేసిన కేసులో ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ (66)కి న్యాయస్థానం ఏడాదిపాటు జైలు శిక్ష విధించింది. 2007 నుంచి 2012 వరకు సర్కోజీ ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఉన్నారు. 2012లో జరిగిన ఎన్నికల్లో ప్రచారం కోసం పరిమితికి మించి ఖర్చు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఖర్చంతా ఆయన కనుసన్నల్లోనే జరిగినట్టు ప్రాసిక్యూషన్ నిరూపించింది.

ఇక ఈ కేసులో ఆయనను దోషిగా తేల్చిన న్యాయస్థానం ఏడాదిపాటు శిక్ష విధించింది. అయితే, ఇంటి వద్దే ఉండి శిక్షను అనుభవించేందుకు అనుమతించిన కోర్టు, శిక్షాకాలంలో ఆయన కదలికలను తెలిపే ఎలక్ట్రానిక్ మానిటరింగ్ పరికరాన్ని ధరించాలని తీర్పులో పేర్కొంది. అయితే, ఈ శిక్షపై పైకోర్టుకు వెళ్లేందుకు న్యాయస్థానం సర్కోజీకి అవకాశం ఇచ్చింది. కాగా, అవినీతికి సంబంధించిన మరో కేసులో దోషిగా తేలిన సర్కోజీకి మార్చిలో ఏడాదిపాటు జైలు శిక్ష విధించినప్పటికీ, రెండేళ్లపాటు అమలు కాకుండా నిలిపివేసింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/