భారత్ లో టెస్లా కార్ల త‌యారీ కేంద్రంపై క్లారిటీ ఇచ్చిన ఎల‌న్ మ‌స్క్‌

ముందుగా దిగుమతి చేసుకునే కార్ల అమ్మకానికి అనుమతినివ్వాలని డిమాండ్
అప్పటిదాకా భారత్ లో ఎక్కడా ప్లాంట్ ఉండదని వెల్లడి

న్యూఢిల్లీ: టెస్లా కంపెనీ సీఈవో ఎల‌న్ మ‌స్క్ భారత్ లో టెస్లా తయారీ ప్లాంట్ పెట్టడంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మొదట కార్లను దిగుమతి చేసి అమ్ముతామని, సర్వీసుకు అనుమతించే వరకు ప్లాంట్ ను పెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. దక్షిణ భారత దేశంలో టెస్లా ప్లాంట్ పెడుతోందంటూ కేంద్రం ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో.. ట్విట్టర్ లో ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు ఆయన ఈ బదులిచ్చారు.

‘‘ముందుగా మా కార్లను అమ్ముకుని, సర్వీస్ చేసుకునేంత వరకు భారత్ లోని ఏ ప్రాంతంలోనూ మేం కార్ల ఉత్పత్తి ప్లాంట్లను పెట్టడం లేదు’’ అని మస్క్ కరాఖండిగా చెప్పారు. వాస్తవానికి ఏడాది కాలంగా కేంద్ర ప్రభుత్వం, టెస్లా మధ్య కార్ల ప్లాంట్ ఏర్పాటుపై వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

ముందుగా ఇక్కడ ప్లాంట్ పెట్టి తయారు చేసి కార్లు అమ్మాలని, ఆ తర్వాత దిగుమతి చేసుకుని అమ్మేందుకు అవకాశమిస్తామని కేంద్రం చెబుతుండగా.. మస్క్ మాత్రం ససేమిరా అంటున్నారు. ముందుగా కార్లను దిగుమతి చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని, దిగుమతి సుంకాలను తగ్గించాలని, దేశంలో మార్కెట్ ను బట్టి ప్లాంట్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు. దీంతో ఆ వ్యవహారం ఎటూ తేలకుండా అయిపోతోంది. ఇప్పుడు మస్క్ సమాధానంతో ఆ వ్యవహారం కొలిక్కి రాకుండా మరింత క్లిష్టం అయిపోతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/