కుబేరుల జాబితాలో మళ్లీ అగ్రస్థానానికి ఎలాన్‌ మస్క్

గత ఏడాది డిసెంబర్ లో టెస్లా పతనంతో 200 బిలియన్‌ డాలర్ల సంపద ఆవిరి

Elon Musk Is World’s Richest Person Again After Tesla Stocks Surge 100%

న్యూఢిల్లీః టెస్లా అధినేత, ట్విట్టర్‌ కొత్త బాస్‌ ఎలాన్‌ మస్క్.. ప్రపంచంలోని సంపన్నుల జాబితాలో తిరిగి తొలిస్థానానికి చేరుకున్నారు. భారీ నష్టాల కారణంగా ప్రపంచ బిలియనీర్ల జాబితాలో రెండో స్థానానికి పడిపోయిన ఆయన.. టెస్లా షేర్లు రాణించడంతో తిరిగి ఫస్ట్ ప్లేస్ కు వచ్చారు. ఈ విషయాన్ని ‘బ్లూమ్‌బర్గ్‌’ సంస్థ తన రిపోర్టులో వెల్లడించింది. బ్లూమ్‌బర్గ్‌ నివేదిక ప్రకారం.. టెస్లా షేర్లు పతనమవడంతో ఎలాన్‌ మస్క్‌ ప్రపంచ కుబేరుల్లో తొలిస్థానాన్ని కోల్పోయారు. గత ఏడాది డిసెంబర్ లో ఆయన సంపద 200 బిలియన్‌ డాలర్ల మేర తగ్గింది. ఈ క్రమంలో చరిత్రలో అత్యంత భారీగా సంపదను కోల్పోయిన వ్యక్తిగా మస్క్ రికార్డు సృష్టించినట్లు ‘గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్’ కూడా ప్రకటించింది.

ప్రస్తుతం టెస్లా షేర్లు బలంగా పుంజుకోవడంతో రెండు నెలల్లోనే మళ్లీ తన స్థానాన్ని సొంతం చేసుకున్నారు. టెస్లా షేర్లు ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 70 శాతం మేర పెరిగాయి. ఫలితంగా ఏడాది మొదట్లో 137 బిలియన్‌ డాలర్లుగా ఉన్న ఎలాన్‌ మస్క్‌ సంపద.. ఇప్పుడు ఏకంగా 187 బిలియన్‌ డాలర్లకు చేరినట్లు బ్లూమ్‌బర్గ్‌ వెల్లడించింది. ప్రపంచ కుబేరుల జాబితాలో మస్క్‌ తర్వాత బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ 185 బిలియన్‌ డాలర్ల సంపదతో రెండో స్థానంలో ఉన్నారు. అమెజాన్ బాస్ జెఫ్ బెజోసో మూడో స్థానంలో, ఒరాకిల్‌ కో-ఫౌండర్‌ లారి ఎల్లిసన్‌ నాలుగో స్థానంలో, దిగ్గజ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ 5వ స్థానంలో కొనసాగుతున్నారు. ఇండియా నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్ అంబానీ 84.3 బిలియన్ డాలర్ల సంపదతో 8వ స్థానంలో ఉన్నారు. గౌతమ్‌ ఆదానీ 37.7 బిలియన్‌ డాలర్ల సంపదతో 32వ స్థానంలో ఉన్నట్లు బ్లూమ్‌బర్గ్‌ తన నివేదికలో పేర్కొంది.