ఫ్రాన్స్‌ పింఛను..వివాదాస్పద అంశాల తొలగింపు

France
France

పారిస్‌: ఫ్రాన్స్‌లో పెద్దయెత్తున ఆందోళనలకు దారితీసిన పింఛను సంస్కరణల్లో వివాదాస్పద అంశాలను కొన్నిటిని మారుస్తున్నట్లు ఫ్రెంచ్‌ ప్రధాని ఎడ్వర్డ్‌ ఫిలిప్పీ ప్రకటించారు. పార్లమెంటు ఆమోదంతో నిమిత్తం లేకుండానే దీనిపై ఓ డిక్రీ జారీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇది పార్లమెంటును తోసిరాజనడమేనని ప్రతిపక్షాలు విమర్శించాయి. పింఛను చట్టానికి ప్రతిపక్షాలు 41వేలకు పైగా సవరణలను ప్రతిపాదించాయి. నయా ఉదారవాద విధానాల్లో భాగంగా ఫ్రెంచ్‌ ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకొచ్చిన గత ఏడాది డిసెంబరులో పింఛను సంస్కరణలను ప్రకటించినప్పటి నుంచి సమ్మెలు, నిరసనలతో ఫ్రాన్స్‌ అట్టుడుకుతోంది. ఫ్రెంచ్‌ ప్రధాని ప్రకటనపై అతి శక్తివంతమైన వర్కర్స్‌ యూనియన్‌ స్పందిస్తూ, ఈ డిక్రీ ఒక పెద్ద మోసం అని వ్యాఖ్యానించింది. పింఛను సంస్కరణలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపుమేరకు శనివారం పెద్దయెత్తున సమ్మె, నిరసనలు జరిగాయి. స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వేసిన ఎత్తుగడగా దీనిని ప్రతిపక్షాలు విమర్శించాయి. వామపక్షాలు, కొన్ని ఇతర ప్రతిపక్ష పార్టీలు ఫ్రెంచ్‌ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం తెస్తామని ఇప్పటికే ప్రకటించాయి.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/