మెదక్‌ చైర్మన్‌ ఎన్నిక… టిఆర్‌ఎస్‌లో అసంతృప్తి

TRS party
TRS party

మెదక్‌: పట్టణంలో జరుగుతున్న మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికలు ఉద్రిక్తతకు దారి తీశాయి. మున్సిపల్ చైర్మన్‌గా తొడుపునూరి చంద్రపాల్‌ను నియమించాలని టిఆర్‌ఎస్‌ అధిష్టానం నిర్ణయించడంపై సొంత పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమైంది. ఈ నిర్ణయంపై తాజా మాజీ చైర్మన్ ఆరేళ్ల మల్లిఖార్జున్ గౌడ్ వర్గీయులు ఆందోళనకు దిగారు. ఉద్యమకారులను పక్కనబెట్టి పెట్టుబడిదారులకు అవకాశం కల్పించారని పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం దగ్గర రాస్తారోకో చేపట్టారు. పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా పని చేసిన తమను కాదని ఇటీవల పార్టీలో చేరిన చంద్రపాల్‌కు అవకాశం కల్పించారని మల్లికార్జున్ గౌడ్, మరో కౌన్సినల్ ఆకిరెడ్డి క్రిష్ణారెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు. మల్లికార్జున్ గౌడ్ గతంలో మున్సిపల్ కౌన్సిలర్ గా, వైస్ చైర్మన్‌గా, చైర్మన్‌గా పని చేశారు. క్రిష్ణారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మెన్‌గా పని చేశారు. ఈ సారి కూడా మల్లికర్జున్ గౌడ్‌కు వైస్ చైర్మెన్ పదవి ఇచ్చేందుకు అంగీకరించారు. అయితే గతంలో పార్టీ వారిని గౌరవించిందని, ప్రతీ సారి వారికే అవకాశం కల్పించలేమని పద్మా దేవెందర్ రెడ్డి సన్నిహితులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే మున్సిపల్ కౌన్సిలర్, చైర్మన్‌ల ఎన్నికల కవరేజీకి మీడీయాను అనుమతి నిరాకరించడంతో జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారలపై లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. 18 మంది టీఆర్ఎస్, 3 బిజెపి, ఇండిపెండెంట్, ఎంఐఎం సభ్యుల మద్దతుతో చంద్రపాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/nri/