తెలంగాణ లోక్‌సభ ఫలితాలపై ఉత్కంఠ….

కారు జోరుకు జాతీయ పార్టీలు చెక్‌ పెట్టేనా…?

TRS, BJP, CONGRESS
TRS, BJP, CONGRESS

హైదరాబాద్‌: తెలంగాణలో 17లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు ముగిశాయి. సర్వే రిపోర్టు ఎలా ఉన్నా….తెలంగాణలో అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్‌ పార్టీ, రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్‌, బిజెపిలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎన్నికల బరిలో గెలుపుకోసం శాయశక్తులా కృషి చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎవ్వరి అంచనాలకు అందకుండా దూసుకుపోయిన విషయం తెలిసిందే. ప్రతిపక్ష పార్టీల అడ్రెస్సును దాదాపు గల్లంతు చేశారు చంద్రశేఖర్‌ రావు. అయితే అధికార టిఆర్‌ఎస్‌ కారు…పదహారు…ఢిల్లీలో మన మద్ధతుతో సర్కార్‌రు అనే నినాదంతో ఎన్నికల బరిలోదిగింది. కనీసం పార్లమెంటు ఎన్నికల్లోనైనా పరువు కాపాడుకోవాలనే లక్ష్యంతో జాతీయ పార్టీలు సర్వశక్తులొడ్డాయి. కెసిఆర్‌ వేస్తున్న ఎత్తులకు బిజెపి, కాంగ్రెస్‌ పార్టీలు కూడా పైఎత్తులు వేయడంలో పోటీపడ్డాయి కనీసం ఐదారు స్థానాల్లో గెలుపొంది. తమ సత్తా నిరూపించుకోవాలని జాతీయ పార్టీలు కాంగ్రెస్‌, బిజెపిలు సర్వశక్తులు ఒడ్డాయి. లోక్‌సభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీని ఎదుర్కొనేందుకు రెండు జాతీయ పార్టీలు శ్రమిస్తున్నాయి. అలాగే ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలు రెండు జాతీయ పార్టీలకు కీలకంగా మారాయి. ఇంకా చెప్పాలంటే ప్రధానంగా కాంగ్రెస్‌ పార్టీకి ఇది జీవన్మరణ సమస్యగా పరిణమించింది. నిన్నటిదాకా అధికారాన్ని, పదవులను అనుభవించి అన్ని విధాలా లాభపడిన సీనియర్‌ నాయకులు జారుకుంటున్నా కాపాడుకోలేని దీన స్థితి కాంగ్రెస్‌లో కనిపిస్తోంది. కనీసం మిగిలి ఉన్నవారిని కాపాడుకోలేని దీన స్థితి కాంగ్రెస్‌లో కనిపిస్తోంది. కనీసం మిగిలి ఉన్న వారిని కాపాడుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. పదహారుకు పదహారు స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావు కసరత్తు చేసి అభ్యర్థులను ఎంపిక చేశారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అందరికన్నా ముందే అభ్యర్థులను ప్రకటించిన చంద్రశేఖర్‌ రావు ఈసారి ఆచితూచి అభ్యర్థులను ప్రకటించారు. దీని వెనకాల పెద్ద లక్ష్యమే ఉన్నట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ఒక్క సీటును కూడా చేజార్చుకోవద్దు అనే లక్ష్యంతో అభ్యర్థులను వడబోసి ఎంపిక చేశారు. సిట్టింగ్‌ ఎంపిలను పక్కనపెట్టి కొత్తవారికి అవకాశం కల్పించారు. ఇందుకోసం ప్రత్యర్థి పార్టీల్లోని బలమైన నేతలకు గాలం వేస్తూ ప్రధాన ప్రతిపక్షాన్ని ఇబ్బందులకు గురిచేసినట్టు తెలుస్తోంది. ఆపరేషన్‌ ఆకర్ష్‌ను బలంగా ప్రయోగిస్తూ వస్తున్న వారిని వస్తున్నట్లు కారెక్కిస్తున్నారు గులాబీ నేతలు. ఇందులో స్వచ్ఛందంగా వచ్చేవారు కొందరైతే రాజకీయ ప్రయోజనాలు, వ్యక్తిగత పనులు ఆశించి వస్తున్న వారు మరికొందరు ఉన్నారనడంలో ఏమాత్రం సందేహం లేదు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయం అవుతాం. ప్రధాన ప్రతిపక్షం అవుతామని నిన్నటి వరకు బీరాలు పలికిన బిజెపి చతికిలపడింది. 2014 ఎన్నికల్లో టిడిపి పుణ్యమా అని 5 సీట్లను గెలుపొందిన బిజెపి ఈ సారి స్వతంత్య్రంగా పోటీ చేసి ఒక్క సీటుతో సరిపుచ్చుకుంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్‌, బిజెఎల్‌పి నేత జి.కిషన్‌ రెడ్డి ఓడిపోవడం తెలంగాణ బిజెపికి కోలుకోలేని దెబ్బగా పరిణమించింది. అయితే ఈపార్లమెంటు ఎన్నికల్లో కనీసం మూడు సీట్లలో జెండా ఎగురేయాలని పావులు కదిపింది. బిజెపి,సికింద్రాబాద్‌, మహబూబ్‌ నగర్‌, నిజామాబాద్‌ నియోజకవర్గాలపై అధికంగా దృష్టిసారించింది. కాంగ్రెస్‌ పార్టీ కూడా కనీసం నాలుగైదు స్థానాలపై గురిపెట్టింది. అందరూ సీనియర్‌ నేతలను బరిలోకి దింపింది. క్షేత్రస్థాయిలో ఉన్న లోటుపాట్లను పరిగణనలోకి తీసుకుని ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రత్యేకమైన బృందాలను ఏర్పాటు చేసి పర్యవేక్షించింది. అయితే లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి ఫలితాలకు మరో 40రోజుల సమయం ఉండటంతో సర్వేలు వివిధ రకాలుగా వస్తున్నాయి. అయితే జెట్‌ స్పీడ్‌ వేగంతో దూసుకెళ్తున్న కారుకు ఎలాగైనా బ్రేకులు వేయాలని అటు బిజెపి, ఇటు కాంగ్రెస్‌ ప్రణాళికలు రచించాయి. అవి ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి మరి. తెలంగాణ వాప్యంగా లోససభ ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.

తాజా సినిమా వీడియోల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/videos