రసవత్తరంగా మధ్యప్రదేశ్‌ ఎన్నికలు

చౌహాన్‌-కమలనాథ్‌ మధ్య హోరాహోరీ….

Shivraj Singh Chouhan, kamal nath
Shivraj Singh Chouhan, kamal nath

బోపాల్‌ : మధ్య ప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికల రణరంగం రసవత్తరంగా సాగుతోంది. బిజెపి మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, ప్రస్తుత కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి కమలనాథ్‌ల మధ్య హోరాహోరీగా సాగుతోంది. పదిహేనేళ్లుగా మధ్యప్రదేశ్‌లో కాషాయం జెండాలే రెపరెపలాడాయి. ఆ పార్టీని ఎదరించే నాయకుడు లేక పాలిటిక్స్‌ చప్పగా సాగాయి. అనూహ్యంగా గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రం ‘హస్తగతమైంది. అప్పట్నుంచి ఇరు పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్టు పోటీ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గిన ఆత్మవిశ్వాసంతో కాంగ్రెస్‌…పార్లమెంటు ఎన్నికలు వేరు, అసెంబ్లీ వేరన్న ధీమాతో బిజెపి ఎన్నికల రణక్షేత్రంలో తలపడుతున్నాయి. ఒక వైపు మూడుసార్లు సిఎంగా పనిచేసిన అనుభవంతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణలను తన గుప్పిట్లో పెట్టుకున్న శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌…మరోవైపు కాంగ్రెస్‌ రాజకీయ దిగ్గజం, ప్రస్తుత ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌. ఈ ఎన్నికల్లో వీరిద్దరి మధ్యే పోటీ. సంక్షేమ పథకాల సారథిగా జనంలో కరిష్మా ఉన్న నాయకుడు చౌహాన్‌. ఆయనని అందరూ ప్రేమగా ‘మామాఅని పిలుస్తారు. గత లోక్‌సభ ఎన్నికల్లో చౌహాన్‌కున్న ఇమేజ్‌కి తోడు మోడీ హవా కలిసి రావడంతో బిజెపి ప్రభంజనం సృష్టించింది. 29 స్థానాలకు 27 చోట్ల జయకేతనం ఎగురవేసింది. కానీ రైతు సమస్యలు, నిరుద్యోగం వంటి కారణాలతో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయింది. అయితే ప్రత్యర్థి కంటే ఓట్లు ఎక్కువగా సాధించడం విశేషం. బిజెపికి 41శాతం ఓట్లు వస్తే, కాంగ్రెస్‌కు 40.9శాతం ఓట్లు వచ్చాయి. మొత్తం 230 స్థానాలున్న అసెంబ్లీలో 114 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్‌ పార్టీ మెజారిటీకి 2 సీట్ల దూరంలో ఉండిపోయింది. బిఎస్‌పి మద్ధతుతో అధికారాన్ని దక్కించుకుంది. కమల్‌నాథ్‌ సిఎం పీఠం అదిష్టించిన దగ్గరి నుంచి లోక్‌సభ ఎన్నికలపైనే దృష్టి పెట్టి…దానికి అనుగుణంగా వ్యూహాలు పన్నుతూ పాలనను పరుగులెత్తిసున్నారు. మరోవైపు బిజెపి…వంద రోజులు దాటిన కమల్‌నాథ్‌ పాలనతో లోటుపాట్లను ఎత్తిచూపుతూ సమరశంఖం పూరిస్తోంది. కేంద్రంలో మోడీకున్న ఇమేజ్‌ లోక్‌సభ ఎన్నికల్లో కలిసి వస్తుందని భావిస్తోంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/