వెంటనే 50 ఉద్యోగ నియామకాల ప్రక్రియ మొదలుపెట్టండి..సీఎం

ఉద్యోగాల భర్తీపై సమీక్షలో సీఎం కేసీఆర్‌

హైదరాబాద్ : తెలంగాణలో నూతన జోనల్ విధానానికి రాష్ట్రపతి ఆమోదం లభించడంతో, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామకాల ప్రక్రియకు తెరలేపింది. జోనల్ అడ్డంకులు తొలగిపోయిన నేపథ్యంలో, రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవాలంటూ సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల్లో ఉన్న దాదాపు 50 వేల ఉద్యోగాలను మొదటి దశలో భర్తీ చేయాలని, దీనికి సంబంధించిన ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని స్పష్టం చేశారు. పదోన్నతుల కారణంగా ఏర్పడే ఖాళీలను గుర్తించి, వాటిని రెండో దశలో భర్తీ చేయాలని సీఎం సూచించారు. స్థానికులకు న్యాయం జరగాలన్న ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం జోనల్ విధానాన్ని తీసుకువచ్చింది. అత్యంత శాస్త్రీయ విధానం అనుసరించి ఈ జోనల్ విధానానికి రూపకల్పన చేసినట్టు టీఆర్ఎస్ సర్కారు చెబుతోంది.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలోఉద్యోగాల భర్తీ అస్తవ్యస్తంగా ఉండేదని గుర్తుచేశారు. ‘స్థానికులకు న్యాయం జరగాలనే ఉద్యమ నినాదాన్ని అమలుచేసేందుకు ప్రభుత్వం నూతన జోనల్‌ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఎంతో శ్రమతో అత్యంత శాస్త్రీయ విధానాన్ని అనుసరించి రూపొందించిన జోనల్‌ వ్యవస్థకు కేంద్రం ఆమోదం లభించడంలో ఇన్నాళ్లు జాప్యం జరిగింది. ఇటీవలే రాష్ట్రపతి ఆమోదముద్ర వేయటంతో రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు అడ్డంకులు తొలగిపోయాయి’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఖాళీల భర్తీ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. నేరుగా భర్తీచేసే అవకాశాలున్న (డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌) అన్ని రకాల ఉద్యోగాలు కలుపుకొంటే 50వేల దాకా ఉన్నాయని, వాటిని ముందుగా భర్తీ చేస్తామని సీఎం ప్రకటించారు. ప్రమోషన్ల ద్వారా ఏర్పడిన ఖాళీలకు సంబంధించిన పూర్తి సమాచారంతో నివేదికను ఈ నెల 13న జరిగే క్యాబినెట్‌ సమావేశంలో సమర్పించాలని అధికారులను ఆదేశించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/