మహారాష్ట్ర సీఎంగా ఏక్‌నాథ్ షిండే..

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ షిండే ఈరోజు రాత్రి 7.30 గంటలకు రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పటి వరకు బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ సీఎం.. ఏక్‌నాథ్‌ షిండే డిప్యూటీ సీఎం అవుతారని అందరూ భావించారు. కానీ అంచనాలు తలకిందులు చేస్తూ ఏక్‌నాథ్‌ షిండే మహారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారణం చేయనున్నట్లు ఫడ్నవీస్‌ స్వయంగా ప్రకటించారు.

మహారాష్ట్రలో గత ఎన్నికల సమయంలో ప్రజలు బీజేపీ – శివసేన కూటమికి మద్దతుగా తీర్పు ఇచ్చారని చెప్పారు. అయితే, థాక్రే మాత్రం బాలా సాహెబ్ – సావర్కర్ లక్ష్యాలకు విరుద్దంగా వ్యవహరించారని ఆరోపించారు. షిండే కు తాము బయట నుంచి మద్దతు ఇస్తామని ఫడ్నవీస్ వెల్లడించారు. మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వాన్ని కూల్చారనే అపవాదు లేకుండా.. థాక్రేను పదవి నుంచి దింపి షిండేకు ఆ బాధ్యతలు అప్పగించాలని బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. శివసేన ప్రభుత్వాన్ని నిలబెట్టే బాధ్యత తమదేనని ఫడ్నవీస్ స్పష్టం చేసారు. ఏక్‌నాథ్‌ షిండే గురువారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో గోవా నుంచి ముంబై చేరుకున్నారు. ముంబై చేరిన ఏక్‌నాథ్‌ షిండే తొలుత బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో భేటీ అయ్యారు. అనంతరం ఇద్దరు కలిసి రాజ్‌భవన్‌లో మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోశ్యారీని కలిశారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు గురించి చర్చించారు.

శాసనసభలో బల పరీక్ష తరువాత కేబినెట్ కొలువు తీరనుంది. దాదాపుగా మొత్తం రెబల్ ఎమ్మెల్యేకు మంత్రి పదవులు దక్కనున్నాయి. రానున్న సార్వత్రిక ఎన్నికలు.. విమర్శలను పరిగణలోకి తీసుకొని బీజేపీ తన వ్యూహం మార్చినట్లుగా స్పష్టం అవుతోంది. దీంతో..ఆటో డ్రైవర్ గా జీవితం ప్రారంభించిన షిండే ఇప్పుడు మహారాష్ట్ర ను డ్రైవ్ చేయనున్నారు.