Auto Draft

నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు అవసరం

Education as a business!
Education as a business!

ఆశ అత్యాశగా మారితే అక్రమాలకు, అవకతవకలకు అవినీతికి,అడ్డూఅదుపు ఉండదు అంటారు.ఆ అత్యాశకాస్త దురాశగా రూపాంతరం చెందితే ఎలాంటి దుష్పరిణామాలు దాపురిస్తాయో వేరే చెప్పక్కర్లేదు.

దురదృష్టంకొద్దీ ఈ పరిస్థితులు విద్యావిధానంలో చోటు చేసుకుంటున్నాయి. రాత్రికిరాత్రే కోట్లు సంపాదించి తెల్లవారేసరికి అవతార మెత్తాలనే ఆరాటపడే కొందరు దురాశాపరులు మొత్తం విద్యావ్యవస్థ ప్రమాణాలనే అడుగంటిస్తున్నారేమోననిపిస్తున్నది.

అధ్యయనంతో విజ్ఞానంతో ఆర్జించి, పరిశోధనలతో మేధాసంపత్తిని పెంచి సమాజ అభ్యున్నతికి ఉపయోగ పడేలా తీర్చిదిద్దేవిధంగా ఉండాల్సిన విద్యావిధానాన్ని వ్యాపార వస్తువుగా మార్చివేశారు.

దీనికితోడు కొందరు ఈ వ్యాపారులు రాజకీయ అవతారం ఎత్తడంతో పరిస్థితి మరింత దిగజారుతోంది.

డబ్బున్నవారికే నాణ్యమైన విద్య లభిస్తుంటే సామాన్యులకు అవకాశాలు సన్నగిల్లుతు న్నాయి. విద్యను కొనుక్కునే సంప్రదాయం రానురాను పెరిగిపోతున్నది.

కరోనా విజృంభించి ప్రజలు ప్రాణ భయంతో అల్లాడుతున్న ఈ దశలో ఆన్‌లైన్‌ బోధన కూడా వ్యాపారంగా మలుచుకునే కొందరు ప్రబుద్ధుల వల్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీకావు.

నిబంధనలకు విరుద్ధంగా, ఫీజులు ఏ రూపంలో వసూలు చేసినా చర్యలు తప్పవని అధికార యంత్రాంగం ప్రకటనల మీద ప్రకటనలు గుప్పిస్తున్నా కొన్ని విద్యాసంస్థలు పట్టించుకోవడం లేదు.

ఇష్టారాజ్యం గా ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. లేకుంటే ఆన్‌లైన్‌ క్లాసులు ఉండవని, కట్‌ చేస్తామని బెదిరిస్తున్నారు. అసలు ఆ ఫీజులు ఎందుకు, ఎంత పెంచారో అందుకు శాస్త్రీ యత ఏమిటో తెలియదు.

తల్లిదండ్రులు, కమిటీలు దీనిపై ఆందోళనలే కాదు న్యాయస్థానాలను కూడా అభ్య ర్ధిస్తున్నాయి. ఇంటర్నెషనల్‌ స్థాయి పాఠశాలల పేరిట ఫీజులు పెంపునకు బరితెగిస్తున్నాయి.

వాస్తవంగా రుసు ముల నియంత్రణపై తెలంగాణ రాష్ట్రప్రభుత్వం నియ మించిన ఆచార్య తిరుమలరావు కమిటీ 2017 డిసెంబరు లోనే నివేదిక సమర్పించింది. ఆ తర్వాత ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు ప్రకటించింది.

దానిపై కొన్ని ప్రైవేట్‌ పాఠశాలలు హైకోర్టును కూడా ఆశ్రయించాయి. పెంచిన ఫీజు చెల్లించలేక ప్రజలు పడుతున్న ఇక్కట్లు అన్నీఇన్నీ కావు.

అసలు తెలుగు రాష్ట్రాల్లో ఏయే ప్రాంతాల్లో ఏయే పాఠశాలలు ఏమేరకు ఫీజులు వసూలు చేస్తున్నాయో రాష్ట్ర ప్రభుత్వానికి తెలియంది కాదు.

అలాగే ఇవి చెల్లించలేక ప్రజలుపడుతున్న ఇక్కట్లు కూడా పాలకులకు తెలియకుండాపోవు దీనికి కమిటీలతో కాలయాపన చేయడం ఏమేరకు సమంజసమో ఆలోచించాలి.

ప్రైవేట్‌ విద్య వ్యాపారం అధికారులు అదుపు చేయలేనంత స్థాయికి ఎదిగిపోయింది.

చివరకు ఎలాంటి అనుమతులు లేకుండా పాఠశాలలు నడుపుతూ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నా కళ్లుమూసుకున్న అధికార గణాన్ని ఏమనాలి?

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలే కొన్నిసార్లు ఇటు పాలకులను, అధికారులను నియంత్రిస్తు న్నారేమోననిపిస్తున్నది.

ఈ వ్యాపారం ఇంత బరితెగించి పోవడానికి ముందుగా నిందించాల్సింది పాలకులనే. సామాన్యులే కాదు రోజువారీ కూలీలు సైతం ప్రైవేట్‌ విద్యవైపే మొగ్గుచూపుతున్నారు.

అవునన్నా కాదన్న ఏ అవకాశం లేక ఆర్థిక స్తోమత లేనివారే మరో గత్యంతరం లేక విధిలేని పరిస్థితుల్లో సర్కారు బడులకు పంపుతున్నా రు.

దీన్ని అవకాశంగా తీసుకొన్ని కొన్ని ప్రైవేట్‌ సంస్థల దోపిడీకి అడ్డేలేకుండాపోయింది. ప్రభుత్వపరంగా విద్యా బోధనను మరింత పటిష్టంగా,ప్రమాణాలు పెంచేవిధంగా రూపుదిద్దేందుకు ఒకపక్కప్రయత్నాలు జరుగుతూనేఉన్నాయి.

ముఖ్యంగా పాఠశాల విద్యను బలోపేతంచేయడంలో రాష్ట్రాలు మద్దతుగా నిలిచేందుకు కేంద్రప్రభుత్వంసరికొత్త ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఈనెల 14న జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

బోధనా అనుభవాలను బలోపేతం చేయడం, రాష్ట్రాలకు ఫలితాలు అనే అర్థంలోసూక్ష్మంగా దీన్ని ‘స్మార్ట్స్‌అని పేరుపెట్టారు.

ప్రపంచబ్యాంకు ఆర్థికసహాయంతో కేంద్రవిద్యాశాఖ చేపట్టే ఈ ప్రాజెక్టు వ్యయం ఐదువేల ఏడువందల పద్దెనిమిది కోట్లు అవ్ఞతాయని అంచనా వేశారు.

ముందుగా దీనిని హిమాచల్‌, రాజస్థాన్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌,ఒడిశా రాష్ట్రాలలో అమలు చేయబోతున్నారు. ఆసియా అభివృద్ధి బ్యాంకు నిధులతో మరో ఐదురాష్ట్రాల్లో అమలుచేయాలని నిర్ణయించారు.

రాష్ట్రప్రభుత్వాలు కూడా ప్రాథమికస్థాయిలో పాఠశాలల విద్యను మరింత బలోపేతం చేసేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఏటా రూ.వేలాది కోట్లు వెచ్చి స్తున్నారు.

అయినా ఆశించిన ఫలితాలు రావడం లేదు. తెలంగాణ ప్రభుత్వం గురుకుల పాఠశాలల ద్వారా జరు గుతున్న విద్యాబోధనలో కొన్నిఫలితాలు సాధించగలిగింది.

కానీ అది ప్రభుత్వపరంగా నడుస్తున్న అన్ని పాఠశాలలకు ఆ విధానాన్ని తీసుకురావాలి.

ఎంతమంది అధికా రులను నియమించినా, ఎన్ని చట్టాలు చేసినా ప్రైవేట్‌ విద్యావ్యాపారాన్ని కట్టడి చేయడం అంతసులభతరం కాదనేవిషయం బయటపడింది.

ఒకవేళ కొత్త చట్టాలు తెచ్చినా వాటినుంచి ఎలా తప్పించుకోవాలో తెలుసుకోలేని అమాయకులు కాదు కొన్ని ప్రైవేట్‌ యాజమాన్యాలు.

శత కోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్లు చట్టం లోని లొసులుగును వాడుకునేందుకు కొత్త మార్గాలను అన్వేషించక మానరు.

ఇప్పుడు కావాల్సింది కమిటీలు, చర్చలు, కొత్త చట్టాలు, హెచ్చరికలుకాదు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రైవేట్‌ యాజమాన్యాలపై కఠిన చర్యలకు శ్రీకారం చుట్టాలి.

అదే సమయంలో ప్రభుత్వర ంగంలో నడుస్తున్న విద్యాబోధనను మరింత ప్రమాణాలు పెంచేందుకు త్రికరణశుద్ధిగా కృషి చేయాలి.

-దామెర్ల సాయిబాబ, ఎడిటర్ , హైదరాబాద్

తాజా ‘మొగ్గ’ (చిన్నారుల ప్రత్యేకం) కోసం : https://www.vaartha.com/specials/kids/