కల్తీని అరికట్టే నాధుడేడి?

Duplicate oils (File)

వారుపోతారు, వండకతిని మనం పోదాం అన్నట్లుగా ఉంది కల్తీ విషయంలో దళారుల వైఖరి. కల్తీని నిరోధించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నాం, ఉక్కుపాదం మోపుతాం, కటకటాలవెనక్కి పంపుతాం, పిడి చట్టాన్ని కూడా పెట్టడానికి వెనుకాడం అంటూ పాలకపెద్దలు ఎంత గట్టి హెచ్చరికలు చేస్తున్నారో అంతకురెట్టింపు స్థాయిలో కల్తీ పెరిగిపోతున్నది. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కూడా కల్తీ విషయంలో తీవ్ర మైన చర్యలుంటాయని హెచ్చరించారు. ఒక్క తెలంగాణా లోనే కాదు రెండూ తెలుగురాష్ట్రాల్లోనూ కల్తీ అదుపు లేకుండా పెరిగిపోతున్నది. హైదరాబాద్‌తోపాటు వరంగల్‌, కరీంనగర్‌ తదితర తెలంగాణ జిల్లాల్లోనే కాక ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, విశాఖపట్నం, ఒకటేమిటి ఇక్కడా అక్కడా అని కాదు ఈ కల్తీ సర్వాంతర్యామిగా వ్యాపిస్తున్నది.

ఈ కల్తీ మహమ్మారి విజృంభణకు వారూవీరూ అని కాదు అన్నివర్గాల ప్రజలు అల్లాడిపో తున్నారు. ఎవరికి ఫిర్యాదు చేయాలో? ఎవరు దీనిపై చర్యలు తీసుకుంటారో? తెలియని సందిగ్ధపరిస్థితి నెల కొన్నది. ఫలితంగా తాగేనీటిలో కల్తీ, పాలల్లో కల్తీ, తినే పప్పులో కల్తీ, ఉప్పులో కల్తీ, నూనెలో కల్తీ, కారంలో కల్తీ, విత్తనాల్లో కల్తీ, ఎరువ్ఞల్లో కల్తీ, చివరకు ప్రాణా పాయస్థితి నుండి కాపాడే అత్యవసర మందుల్లో కల్తీ ఇదీ అదీ అనిలేకుండా మొత్తం కల్తీమయం అయిపోతున్నది. రానురాను కల్తీ వల్ల మనిషి మనుగడకే ప్రమాదం వాటిల్లే సూచనలు కన్పిస్తున్నాయి. ఇప్పటికే లక్షలాది మంది కల్తీకాటుకు బలవ్ఞతుంటే మరికొందరు వివిధ రోగాల బారినపడి ఆస్పత్రిపాలవ్ఞతుండగా అందులో కొందరు పైలోకానికి పయనం కడుతున్నారు.

ఏ వస్తువ్ఞ తింటే అందులో ఏ కల్తీ ఉందో ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అని భయపడే దురదృష్టపు రోజులు దాపురించాయి. కల్తీ ఇంత ప్రమాదకరంగా తయారవ్ఞతున్నా, పొగమంచులా అంతటా విస్తరిస్తున్నా అడిగేవారు కానీ, అడ్డగించేవారు కానీ కరవైపోయారు. అప్పుడప్పుడు ఏదో కేసులు నమోదు చేసినా, జైళ్లకు పంపినా అవేమీ ఈ కల్తీని నియంత్రించలేకపోతున్నాయి. అవినీతికి కల్తీకి అవినాభావ సంబంధం ఉంది. ఒకటి విడిచి మరొకటి ఉండదు. అందుకే పెరుగుతున్న అవి నీతికి రెట్టింపు స్థాయిలో కల్తీ పెరిగిపోతున్నది.

దీనిని అరికట్టేందుకు పటిష్టమైన చట్టాలు చేశారు. చర్యలు తీసు కుంటున్నారు. కోట్లాది రూపాయల ప్రజాధనం వెచ్చించి వేలసంఖ్యలో అధికారులను నియమించారు. ఈ అధికా రులు కానీ, సదరు చట్టాలు కానీ ఈ కల్తీని నిరోధించలే కపోతున్నాయి. సమస్య ఇంత తీవ్రరూపంలో విలయ తాండవం చేస్తున్నా అటు కేంద్రప్రభుత్వం కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఆశించిన మేరకు శ్రద్ధ తీసుకో వడం లేదు. అప్పుడప్పుడు జనం కన్నీరు తుడిచేందుకు తమ ఉనికి గుర్తు చేసేందుకు మొక్కుబడిగా దాడులు చేస్తున్నారు తప్ప ప్రజల ప్రాణాలతో ఆటలాడుకుంటున్న ఈ కల్తీని నిరోధించడానికి పటిష్టమైన చర్యలు చేపట్టి కల్తీని పునరావృతం కాకుండా చేయలేకపోతున్నారు. ఈ కల్తీ ఏదో రహస్యంగా జరగడం లేదు. బాహాటంగానే జరుగుతున్నది.

పరిశోధించి, రాత్రింబవళ్లు శ్రమించి పట్టుకోవాల్సిన పని అంతకంటే లేదు. పోని ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో, గ్రామాల్లో జరగడం లేదు. ఇక్కడా అక్కడా అని తేడా లేకుండా పట్టణాలు, నగరాల్లో చివరకు రాష్ట్ర ఉన్నతస్థాయి అధికారులు అందరూ కొలు వ్ఞ తీరే ఇటు హైదరాబాద్‌, అటు ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి చుట్టూ ఉన్న గుంటూరు, విజయవాడలలో కూడా పెద్దఎత్తున జరుగుతున్నది. అమాయక ప్రజలు నిలువ్ఞదోపిడీకి గురవ్ఞతున్నారు. ఆర్థికంగా నష్టపోతే నష్టపోయారు. కానీ ఆరోగ్యం కోల్పోతున్నారు. క్షయ, కేన్సర్‌, ఊపిరితిత్తుల వ్యాధి వంటి రోగాలకు గురై ఏళ్ల తరబడి మంచానికి అంకితమై కృంగికృశించి అసువ్ఞలు బాస్తున్నారు. ఇటీవల ఈ కల్తీ వల్లనే కిడ్నీ వ్యాధులు పెరిగిపోతున్నాయని, ఏటా ఆరువేల మందికిపైగా కిడ్నీ రోగులు నమోదు అవ్ఞతున్నారనే వార్తలు ఆందోళన కలిగి స్తున్నాయి.అన్నింటికంటే ముఖ్యంగా పాలల్లో కల్తీ రాను రాను తీవ్రరూపం దాలుస్తున్నది. పుట్టిన పసిబిడ్డ నుంచి 80ఏళ్ల వయోవృద్ధుల వరకువాడే ఈ పాలను యూరి యా, డిటంర్జంట్‌ సోపులతోపాటు రసాయనికాలు కలిపి తయారు చేస్తున్నారు.

పట్టుబడిన వారిపై ఏదో చట్టం తన పని తాను చేసుకుంటుందని చెప్తున్నారు తప్ప నిర్దిష్టమైన చర్యలు లేవ్ఞ. ఫలితంగా జైళ్లకు వెళ్లి తిరిగి వచ్చిన వారు కూడా అదే కల్తీ వ్యాపారంలో నిమగ్నమ వ్ఞతున్నారు. కల్తీ జరగకుండా చూసేందుకు వేలాది రూ పాయలు జీతభత్యాలు తీసుకుంటున్న కొందరు అధికారు లు కల్తీ సామ్రాజ్యానికి కాపలాదారుగా వ్యవహరించడం దురదృష్టకరం. కల్తీ ఇంత తీవ్రరూపం దాలుస్తున్నా ఈ విషయంలో రాజకీయ నేతలు కూడా సమర్థవంతంగా వ్యవహరించలేకపోతున్నారు. ఈ కల్తీ సామ్రాట్లకు కొంద రు నేతలు పరోక్షంగానో, ప్రత్యక్షంగానో చేయూతనిస్తు న్నారు. అందుకే ఇంత విచ్చలవిడిగా పెరిగిపోతున్నా ప్రజాజీవితాన్ని నరకప్రాయం చేస్తున్నా నిరోధించే ఆలో చన కానీ, ప్రయత్నాలు కానీ త్రికరణశుద్ధిగా జరగడం లేదు.

ఈ విషయంలో పాలకులు ఇప్పటికైనామనస్సుపెట్టి ఆలోచించాలి. రాజకీయాలకు అతీతంగా ఆలోచించాల్సిన తరుణమిది. ప్రజాసంఘాలు కూడా కల్తీని నిరోధించే విషయంలో ముందుకురావాల్సిన అవసరం ఉంది. కల్తీపై యుద్ధం చేయాలంటే అంత తేలికైన పనికాదు. ఇందుకు ఎంతో ఆత్మవిశ్వాసం, గుండెనిబ్బరం, చిత్తశుద్ధికావాలి. ఒత్తిడిలను తట్టుకునే ఓర్పు, బెదిరింపులను లెక్కచేయని సాహసం ఉండాలి. వీటన్నింటిని మించి అనుకున్న ధ్యేయం పట్ల అకింతభావం, నిజాయితీ ఉండాలి. అందరూ కలిసికట్టుగా కల్తీ సామ్రాట్ల ఆటకట్టించేందుకు నడుం కట్టాల్సిన సమయమిది.

తాజా స్వస్థ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/health/