ఇరాన్‌ గగనతలంలో యుద్ధమేఘాలు!

War Atmosphere in Iran
War Atmosphere in Iran


గల్ఫ్‌దేశాలతో ముడిచమురు వాణిజ్య సంబంధాలున్న దేశాలకు ఇప్పుడు అమెరికా ఇరాన్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు కలవరం కలిగిస్తున్నాయి. ఇటీవలే అమెరికాకు చెందిన హాక్‌డ్రోన్‌ను ఇరాన్‌ కూల్చివేసిన సంఘటనతో రెండుదేశాల మధ్య సంబంధాలు మరింత బెడిసికొట్టాయి. దీనితో ఇరాన్‌పై వైమానిక దాడులకు ఆమోదం తెలిపిన ట్రంప్‌ ఇక యుద్ధవిమానాలు బయలుదేరతున్న చివరినిమిషంలో అనూహ్యపరిస్థితుల్లో తన నిర్ణయాన్ని వెనక్కితీసుకున్నారు. దీనివల్ల కొంతమేర యుద్ధం తప్పిందనే భావించాలి. ఈ రెండుదేశాలమధ్య ఉద్రిక్తతలు ఇతర వాణిజ్యదేశాలకు సవాల్‌గా మారుతున్నాయి.డ్రోన్‌ను కూల్చివేసిన తర్వాత అమెరికా ఇరాన్‌ గగనతలంపై వెళ్లే విమానసర్వీసులు నిలిపివేయాలని ఆదేశించింది. భద్రతా కారణాలరీత్యా అమెరికా విమానయాన సంస్థలు ప్రత్యామ్నాయ రూట్లలో రాకపోకాలు సాగించేందుకు వీలుగా ఈ చర్యలు తీసు కుంది. దీనివల్ల న్యూజెర్సినుంచి ముంబయి వచ్చే విమా నాలు మొత్తంగా నిలిచిపోయాయి. ఇవన్నీ ఇరాన్‌ గగన తలంపైనుంచి రావాల్సిందే. ఇరాన్‌ ఆధీనంలో ఉన్న హార్మజ్‌ సంధిగుండా నౌకాయానం, గగనతలంపై వెళ్లాలంటే అమెరికా విమానాలకు భద్రత ముప్పు ఎదురవుతోంది. అంతేకాకుండా ఓమన్‌ గల్ఫ్‌ ప్రాంతంపైనుండి వెళ్లడం కూడా అమెరికాకు శ్రేయస్కరం కాదు. అందువల్లనే అమెరికా వైమానిక విభాగం అత్యవసర ఉత్తర్వులు జారీచేసి ఈ రూట్లలో వెళ్లకుండా ప్రత్యామ్నాయాలను ఎంపిక చేసుకోవాలని సూచించింది. హార్మజ్‌జల సంధిగుండా వెళ్లే నౌకలకు సైతం భద్రత పెంచింది.పర్షియన్‌ గల్ఫ్‌లో నెల కొన్న ఈ ఉద్రిక్తతల కారణంగా చమురురవాణా ట్యాంకర్ల కుసైతం ముప్పుకలుగుతుందని అంచనా. ఇటీవలే పర్షియన్‌ గల్ఫ్‌లో జపాన్‌, ఇండోనేసియాకు చెందిన నౌకలుగా చెపు తున్న రెండు నౌకలు అకారణంగా మంటల్లో చిక్కుకున్నా యి. ఇందుకు ఇరాన్‌దే బాధ్యత అని అమెరికా అనుమా నిస్తోంది. ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు పెంచిన నేపథ్యంలో ఇరాన్‌నుంచి చమురునుసైతం కొనుగోలుచేయవద్దని అమెరికా శాసిస్తోంది. అణుఒప్పందంపైనే ఈ రెండు దేశాలమధ్య నెలకొంటున్న వివాదం చిలికి చిలికి యుద్ధం దిశగా వెళుతోంది. ఈ వాతావరణం ప్రపంచ దేశాలకు సైతం ఆందోళన కలిగించే అంశమే. ఇప్పుడు గల్ఫ్‌దేశాలకు రాకపోకలు సాగిస్తున్న చమురు ట్యాంకర్లకుసైతం ఆ దేశాలు భద్రతలు కల్పించుకోవాల్సి వచ్చింది. ఇరాన్‌కు చెందిన ముడిచమురు ట్యాంకర్లపై అమెరికా దాడులు చేసిన సంఘటన అన్నిదేశాల చమురు ట్యాంకర్లకు భద్రత పెంచు కోవాల్సిన పరిస్థితి ఉత్పన్నం అయింది. గల్ఫ్‌దేశాల నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో అత్యధికంగా భారత్‌ అన్నది నిజమే. ఇరాక్‌, సౌదీ అరేబియా, యుఎఇ, కువైట్‌ల నుంచే భారత్‌కు చమురు దిగుమతి అవుతుంది. భారత్‌ ముడిచమురు అవసరాల్లో 63శాతం గల్ఫ్‌దేశాల నుంచే వస్తుంది. ఇందుకోసం ఎనిమిది ముడి చమురు రవాణా ట్యాంకర్లు అనునిత్యం రాకపోకలు సాగిస్తున్నందున వీటికి కట్టుదిట్టమైన భద్రత అనివార్యమైంది. ప్రత్యేక కారణాలు ఎలా ఉన్నా ఇరాన్‌ అమెరికాలమధ్య పరోక్షంగా యుద్ధ వాతావరణమే నెలకొన్నదని చెప్పాలి. డ్రోన్‌ను కూల్చివేసిన సంఘటన తర్వాత అమెరికాపై అవసరమైన అన్నిమార్గాల్లోను ఇరాన్‌ దాడులకు ఉపక్రమిస్తున్నదనే చెప్పాలి. సైబర్‌ నిఘా విభాగం సాయంతో అమెరికా నౌకల ట్రాకింగ్‌ వెబ్‌సైట్‌నే హ్యాక్‌చేసింది. దీనివల్ల యుద్ధనౌకలు, ప్రయాణీకుల నౌకల ట్రాకింగ్‌ డేటా తెలుసుకోవచ్చు. అంతే కాకుండా హనీట్రాప్‌నుసైతం ఇరాన్‌ అమలుచేస్తోంది. అందమైన యువతులతో సోషల్‌మీడియా సంభాషణల ద్వారా నావికా, ఎయిర్‌బేస్‌ సిబ్బందిని వలలోవేసుకుని వారినుంచి కీలక సమాచారం సేకరించే పనులుచేస్తోంది. ఇందుకు ప్రతిగా మొత్తం ఇరాన్‌ సైబర్‌ నెట్‌ వ్యవస్థపైనే అమెరికా దాడిచేసింది. ఈ దాడి ప్రభావం ఎంతమేర ఉందో బైటికి వెల్లడించలేదుకానీ రెండుదేశాలమధ్య ఇక ప్రత్యక్షపోరు ఒక్కటే మిగిలిందన్నట్లుగా ప్రస్తుత వాతా వరణం నెలకొంది. ప్రత్యేకించి గగనతలంపై ఆంక్షలు, గల్ఫ్‌సముద్రజలాల్లో ట్యాంకర్ల రాకపోకలకు భద్రతపెంపు వంటి అంశాలను చూస్తే ఎప్పటికైనా ఇరాన్‌పై అమెరికా దాడిచేయక తప్పదన్న సంకేతాలు ఇస్తోంది. అంతేకాకుండా అమెరికా విమానాలు తమ దేశ గగనతలంపైకి వస్తే కూల్చేయడానికిసైతం ఇరాన్‌ వెనుకాడటంలేదు. ఇందుకు సుదూరలక్ష్యాలు ఛేదించే క్షిపణులనుసైతం వినియోగిస్తామని ముందుగానే హెచ్చరిస్తోంది. అంతర్జాతీయ గగనతలంలోనికి వచ్చినాసరే భూమిపైనుంచి ప్రయోగించే క్షిపణుల సాయంతోనే వీటినికూల్చివేస్తామని ఇరాన్‌ ధీమాతో ఉంది. గతంలో ఉక్రెయిన్‌ గగనతలంలో ఇదేతరహా విమానాన్ని కూల్చివేసిన సంఘటన అంతర్జాతీయంగా వివాదాస్పదమైంది. ఇప2డు అమెరికా చేసిన హెచ్చరికలతో బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీదేశాలు కూడా అప్రమత్తం కావాల్సి వచ్చింది. అమెరికా ఎయిర్‌లైన్స్‌, డెల్టా ఎయిర్‌లైన్స్‌ విమా నాలు ఇరాన్‌ గగనతలంపై నుంచి వెళ్లబోమని స్పష్టం చేసాయి. జపాన్‌ విమానయానసంస్థలు జపాన్‌ ఎయిర ్‌లైన్స్‌, ఎఎన్‌ఎ హోల్డింగ్స్‌ ఇంక్‌ వంటివికూడా ఇరాన్‌ గగనతలంపై నుంచి వెళ్లేదిలేదని స్పష్టంచేసాయి. ఇప్పుడు పర్షియన్‌గల్ఫ్‌లో చోటుచేసుకుంటున్న ఈ ఉద్రిక్తతలు గల్ఫ్‌దేశాలకే కాకుండా ఈదేశాలతో వాణిజ్య లావాదేవీలు నిర్వహించే భారత్‌లాంటి దేశాలకు విఘాతం కలుగుతుంద నడంలో ఎలాంటి సందేహంలేదు. అంతర్జాతీయ సమాజం ముందుగానే మేల్కొని ఈ రెండుదేశాలమధ్య సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభించి చర్చలద్వారా రాజీ మార్గాన్ని అన్వేషించకపోతే భవిష్యత్తులో జరిగే అనర్ధాలకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.

  • దామెర్ల సాయిబాబ, ఎడిటర్‌, హైదరాబాద్‌