‘ఆర్థికవృద్ధి’కి సంస్కరణల ఊతం

Economic growth

ఆర్థికవృద్ధి మందగమనం. వృద్ధికి ఊతం ఇచ్చే కార్యాచరణలు పలు ప్రకటించినా ఖజానాకు భారమే అయింది. సుమారు 1.45 లక్షలకోట్లవరకూ పన్నురాయితీల రాబడిలోటు ప్రభుత్వానికి కలవరం కలిగిస్తోంది. ఈనేపథ్యంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థికసర్వే అంచనాలు కొంత ఆర్థికవృద్ధికి ఊతం ఇచ్చేవిగా ఉన్నాయి.

రానున్న ఆర్థిక సంవత్సరంలో వృద్ధికి అనుకూలమైన కార్యాచరణ, సంస్కరణలతో కూడిన బిల్లులు అమలుకు వస్తుండటంతో పెట్టుబడులు పెరగడం, ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ఆర్థికలోటు భర్తీకి అవసరం అయ్యే లక్షకోట్ల నిధులు సమీకరించుకో వడంతోపాటు ప్రభుత్వరంగంలోని మౌలికవనరుల ప్రాజెక్టులపై వ్యయం పెంచడం వంటివి కొన్ని సానుకూల పరిణామాలని చెప్పుకోవచ్చు.

వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆర్థికవృద్ధి ఆరునుంచి 6.5శాతంవరకూ ఉంటుందని ప్రధాన ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రహ్మణియన్‌ వెల్లడించారు. ఐఎస్‌బి ఆచార్యులు వేసిన లెక్కల అంచనాలు డొల్ల కాదని తేల్చిచెప్పేందుకు ఆయన బహుళ ప్రతిపాదనలు కూడా చూపించారు. ముందు ఉల్లి వంటి నిత్యావసర వస్తువుల ధరలు స్థిరీకరించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. ఈ ఏడాది ఆర్థికవృద్ధి ఐదుశాతం మాత్రమే ఉంటుందని ప్రకటించిన అర్థగణాంక శాఖనిపుణులు వచ్చే ఏడాదిమాత్రం 6.5శాతానికి పెరుగుతుందని ఘంటాపథంగా చెపుతున్నారు. ఆర్థికరంగంలో నెలకొంటున్న తీవ్రస్థాయి సమస్యలు వృద్ధిపై ప్రభావం చూపించాయి.

జూలై సెప్టెంబరు 4.5శాతంకు దిగజారిన వృద్ధి ఐదుశాతానికి పెరిగింది. ఇక రానున్న కాలంలో వృద్ధికారకమైన అంశాలు పలు ఉన్నట్లు ఆర్థికసర్వే గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. మోడీ రెండోసారి పగ్గాలు చేపట్టిన తర్వాత ఆర్థికరంగ సంస్కరణలపైనే ఎక్కువ దృష్టిసారించిన సంగతి తెలిసిందే. బ్యాంకుల విలీనం, కార్పొరేట్‌లకు పన్నురాయితీలు, ఇన్వెస్టర్లకు పలు ప్రోత్సాహకాలు, కొత్త కార్పొరేట్లకు మూడేళ్లవరకూ పన్నురహిత మద్దతు వంటివి ఎన్నో వరాలు కురిపించారు. ఇక ఆర్థికసర్వేలో ఉపాధికి ఎనలేని ప్రాధాన్యతను ఇచ్చారు. ఉత్పత్తిరంగ పరంగా ప్రపంచానికి ఉత్పత్తులు భారత్‌ నుంచే ఎగుమతి కావాలన్న లక్ష్యంతో అసెంబిల్‌ ఇండియాకు పెద్దపీట వేసారు.

ఓడరేవుల్లో ఉన్న ఆధిపత్యధోరణులను నిర్వీర్యం చేసి ఎగుమతులను ప్రోత్సహించడం, కాంట్రాక్టులు పెరిగేవిధంగా కార్పొరేట్లకు మద్దతివ్వడంకూడా కీలకం అయింది. దేశంలో ముందు సంపదసృష్టి జరగాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది. 1999లో ఐదువేల మార్కు దాటినసెన్సెక్స్‌ ఈ ఏడాది 40వేల పాయింట్లను అధిగమించిందంటే ఆర్థికవృద్ధికి మరింత ఊతం ఉంటుం దని అంచనా. మార్కెట్‌ లావాదేవీలు పెరిగితేనే నిధుల వృద్ధి స్పష్టంగా కనిపిస్తుంది.

వీటికిముందు ఆర్థికవ్యవస్థ ను వెంటాడుతున్న లోటును భర్తీచేసుకోవాల్సిన అత్య వసర తక్షణ కర్తవ్యం పాలకుల ముందున్నది. 2016లో 3.5శాతం ఉన్న ఆర్థికలోటు ఈ ఏడాది 3.3శాతంగా ఉంటుందని అంచనా వేసినాలోటు ఆ స్థాయికి రాలేదనే చెప్పాలి.ఇవి కేవలం వేసుకున్న అంచనాలు. వీటిని ఇప్ప టికీ చేరుకోలేదు. రెండేళ్లక్రితం 3.5శాతానికి చేరిన లోటు క్రమేపీ తగ్గుతూ 3.4శాతంవరకూ వచ్చింది.అయితేవీటికి అనేక కారణాలు కూడా ఉన్నాయి.

లోక్‌సభ ఎన్నికలు, మరికొన్ని అసెంబ్లీలకు ఎన్నికల కారణం, ఆందోళనలు, నిరసనలతో వాణిజ్య లావాదేవీలు మందగించడం వంటి కారణాలు లేకపోలేదు.వీటితోపాటే అన్నింటికంటే ముందు ఉచిత ప్రయోజనాలు కల్పించడం ఆర్థికవ్యవస్థకు నష్టదాయకమేనని ఆర్థికసర్వే తేల్చిచెప్పింది. దీనివల్ల లబ్ధిదారులు తక్కువ ఎక్కువ ఖర్చుచేసి, తక్కువ పొదుపు చేస్తారన్నది అంచనా. ఇక రుణమాఫీలు కూడా ఆర్థిక వ్యవస్థకు ప్రతికూలమేనని సర్వే స్పష్టంచేసింది. విదేశీ పెట్టుబడులు మరింతగా పెరగాలి. 24.4 బిలియన్‌ డాలర్లువరకూ ఉన్న విదేశీపెట్టుబడుల రాక సుమారు40 బిలియన్‌డాలర్ల వరకూ పెరగాల్సిన అవసరం ఉంది.

మొదటి ఆరునెలల్లోనే ఈ ఏడాది 7.3 బిలియన్‌ డాలర్లు మాత్రమే వచ్చాయి.గత ఏడాదికంటే తక్కువగానే ఉన్నా యి.ఇక ద్రవ్యోల్బణం నియంత్రించాల్సిన అవసరంఉంది. ఆర్‌బిఐ అంచనాలకు అనుగుణంగానే 3.3శాతంగా ఉంటుందని అంచనావేసినా డిసెంబరులో 7.35శాతంగా ఉంది. టోకుధరల సూచీ మాత్రం 3.2నుంచి 2.6శాతా నికి తగ్గింది. ఇక ఉపాధిపరంగా సర్వేలో 26.2 మిలి యన్ల మందికి ఉపాధి కల్పించారు. గ్రామీణప్రాంతాల్లో 12.1 మిలియన్లు, పట్టణప్రాంతాల్లో 13.9 మిలియన్ల మందికి కొత్త ఉపాధి కల్పించినట్లు అంచనా వేసింది.

ఐదులక్షల కోట్ల ఆర్థికవ్యవస్థగా మారాలంటే ప్రభుత్వరంగ బ్యాంకుల్లో సంస్కరణలు వేగవంతం కావాలి. భారతీయ బ్యాంకింగ్‌ వ్యవస్థలో 70శాతం వాటాతో ఉన్న ప్రభుత్వ బ్యాంకుల్లో మరింతగా సంస్కరణలు రావాలి. డిపాజిట్ల తో పాటు రుణపరపతిని కూడా సరళీకృతం చేసి వేగవం తం చేయాలి.

నాన్‌బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల్లో నెల కొన్న సంక్షోభం నివారణకు పాలకులు దృష్టిపెట్టాలి. గ్రామీణ ఆర్థికవ్యవస్థ మరింతగా పురోగమిస్తే వారిలో వ్యయసామర్థ్యం పెరుగుతుంది. ఇక పరోక్షపన్నుల రంగం లో గడచిన తొమ్మిదినెలల కాలంలో 4.1శాతం పెరుగు దల నమోదు చేసింది. సేవలరంగంలోనే ఎక్కువశాతం వృద్ధి కనిపించింది. ఇదేతీరు కనిపిస్తే ఆర్థికవృద్ధి పరంగా భారత్‌ రానున్న కాలంలో గాడినపడినట్లేనని చెప్పవచ్చు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/