భూ పరిపాలనలో సరికొత్త శకం

రైతు సమస్యలకు పరిష్కారం
కొత్త రెవెన్యూ చట్టం వల్ల అన్నదాతల కడగండ్లు తొలగిపోనున్నాయి. ఇందులోని షరతుల వల్ల ఆస్తి తగాదాలకు తెరపడనుంది.

భూ బదిలీలో పారదర్శకత మరింత పెరగడం వల్ల అక్రమ భూ మార్పిడులు, అక్రమ పాసుపుస్తకాల జారీ, ప్రభుత్వ భూములను అక్రమంగా తమ పేర్లపై రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం, ల్యాండ్‌ మాఫియా, భూ కబ్జాలు తగ్గే అవకాశం ఉంది. ధరణి వెబ్‌సైట్‌లో సమగ్ర హక్కుల రికార్డు పూర్తి చేయడం, కొన్న వారి పుస్తకంలోకి బదిలీ చేయడం వంటి ప్రక్రియలన్నీ వెంటవెంటనే పూర్తి చేయడం వల్ల రైతులకు కాలం, డబ్బు ఆదా అవుతాయి. ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని ఉండదు. అమ్మేవాడు, కొనేవాడు రెండు సాక్షులతో ఆన్‌లైన్‌ స్లాట్‌ బుక్‌ చేసుకొని వెళితే నాలుగు రోజుల్లో మొత్తం పని పూర్తి కావడం, భూ యాజమాన్య పాసుపుస్తకం, హక్కు పత్రం ఇవ్వడం వల్ల రైతులకు వారి భూమిపై శాశ్వత హక్కులు సమకూరనున్నాయి.

భూమి నాది యనిన భూమి పక్కున నవ్వు అని వేమన వేదాంత ధోరణిలో చెప్పినా ఉత్పత్తికి ప్రధాన వనరు అయిన భూమిపై ఆధిపత్యం కోసం జరిగిన పోరాటమే మానవ జాతి చరిత్ర. వేదకాలం నుండి నేటి ఆధునిక కాలం వరకు భూమి అనేక విధా లుగా చేతులు మారుతూ వచ్చింది.

మార్పుల నుంచి మొఘలులు, బ్రిటిష్‌ వారి వరకు ప్రతీ రాజ వంశం వారు భూములను అభివృద్ధి చేయడం, సర్వే, నిర్దిష్ట కొలతల ప్రకారం హద్దుల నిర్ణయం, శిస్తు వసూలు, దానాలు చేయడం చేస్తూ వచ్చారు. ప్రభుత్వానికి రెవెన్యూ రాబడిలో భూమిశిస్తు ప్రధాన వనరుగా ఉండటం వల్ల మధ్యవర్తులు, గ్రామీణ శిస్తు వసూలు అధికారులు, దొరలు, పెత్తందారులు, దేశ్‌ముఖ్‌లు, పేద రైతాంగాన్ని దోపిడీ చేస్తూ వచ్చారు. తెలం గాణాలో 1946-48 మధ్యకాలంలో తీవ్ర పోరాటం జరిగింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భూగరిష్ట పరిమితి సంస్కరణల, పటేల్‌, పట్వారీ వ్యవస్థ రద్దు, విర్‌ఓ వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది. ప్రస్తుతం అమలులో ఉన్న రెవెన్యూ వ్యవస్థ పూర్తి అవినీతి మయంలో కూరుకుపోయింది. విఆర్వో, తహశీల్దార్‌, ఆర్‌డిఒ, డిఆర్‌ఒలే గాక కార్యాలయాలలో పనిచేసే క్లర్కులు, ఆర్‌ఐలు సైతం అవినీతికి అలవాటు పడ్డారు. రైతులు భూమి అమ్మకం, కొనుగోలు చేస్తే యాజమాన్య మార్పిడి చేయడం, వారసత్వ బదిలీ, సర్వే నెంబర్లలో మార్పులు, మ్యూటేషన్‌, తదితర సేవ లకు రేట్లు నిర్ణయించి అక్రమ వసూళ్లకు పాల్పడి కుబేరులయ్యా రు.

ఈ వ్యవస్థీకృత దోపిడీని ఏ పాలకులు అరికట్టలేకపోయారు. ఫలితంగా నిస్సహాయులైన రైతులు ఆత్మహత్యలకు యత్నించడం, అధికారులను నిలదీయం, ఎమ్‌ఆర్‌ఒను తగలబెట్టడం, టవర్లు ఎక్కి నిరసన తెలపటం, తహశీల్దార్‌ కార్యాలయంలో పురుగుల మందు తాగి నిరసన తెలపడం, పత్రికలు, ఛానళ్లు అనేక సార్లు ఈ దోపిడీని వెల్లడి చేయడం జరుగుతూ వచ్చింది.

ఈ రెవెన్యూ వ్యవస్థను సంస్కరించాలని 1971 నాటి పట్టాదారు పాసుపుస్తకాల చట్టం రద్దు చేసి ఆర్‌ఒఆర్‌ చట్టం-2020 బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టడం ఆహ్వానించదగ్గ పరిణామం. కొత్త రెవెన్యూ చట్టం వల్ల అన్నదాతల కడగండ్లు తొలగిపోనున్నాయి. ఇందులోని షరతుల వల్ల ఆస్తి తగాదాలకు తెరపడనుంది. భూ బదిలీలో పారదర్శకత మరింత పెరగడం వల్ల అక్రమ భూ మార్పిడులు, అక్రమ పాసుపుస్తకాల జారీ, ప్రభుత్వ భూములను అక్రమంగా తమ పేర్లపై రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం, ల్యాండ్‌ మాఫియా, భూ కబ్జాలు తగ్గే అవకాశం ఉంది.

ధరణి వెబ్‌సైట్‌లో సమగ్ర హక్కుల రికార్డు పూర్తి చేయడం, కొన్న వారి పుస్తకంలోకి బదిలీ చేయడం వంటి ప్రక్రియలన్నీ వెంటవెంటనే పూర్తి చేయడం వల్ల రైతులకు కాలం, డబ్బు ఆదా అవ్ఞతాయి. ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని ఉండదు. అమ్మేవాడు, కొనేవాడు రెండు సాక్షులతో ఆన్‌లైన్‌ స్లాట్‌ బుక్‌ చేసుకొని వెళితే నాలుగు రోజుల్లో మొత్తం పని పూర్తి కావడం, భూ యాజమాన్య పాసుపుస్తకం, హక్కు పత్రం ఇవ్వడం వల్ల రైతులకు వారి భూమిపై శాశ్వత హక్కులు సమకూరను న్నాయి.

ఇక ముందు తండ్రి భూమిని వారసులు బదిలీ చేసుకునే టప్పుడు ఉమ్మడి ఒప్పందం జరగాలనడం వల్ల అందరికి సమ న్యాయం జరుగుతుంది. తహశీల్దార్‌లు, ఆర్‌డిఒల విచక్షణాధికా రాలు రద్దు చేయడం, తహశీల్దార్‌లకు జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌లు గా హక్కులు కల్పించడం వల్ల అక్రమ రిజిస్ట్రేషన్లు తగ్గి, రైతులకు తమ మండల కేంద్రాలలోనే వేగంగా రిజిస్ట్రేషన్‌ చేసుకునే వీలు కలుగుతుంది.

రెవెన్యూ కోర్టులను రద్దు చేసి 16 ఫాస్ట్‌ట్రాక్‌ ట్రిబ్యునల్స్‌ ఏర్పాటు చేయడం, వాటికి విచారణ కాలపరిమితిని నిర్దేశించడం వల్ల భూ వివాదాలు వేగంగా పరిష్క రించబడి సత్వర న్యాయం జరుగుతుంది. రెవెన్యూ సంస్కరణల కొత్త ఆశారేఖగా కన్పిస్తున్నా పలు లోపాలు కూడా కన్పిస్తున్నాయి. భూ రికార్డులు నవీకరణ పూర్తి పారదర్శకంగా, న్యాయబద్ధంగా జరగలేదు.

ఇప్పటికే అనేక వివాదాలు ఉండటం, తమ భూములు వేరే వారి పేరు మీద రిజిస్టర్‌ చేశారని, సర్వే నెంబర్లు మార్చారని రైతులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అందువల్ల మరో సారి సమగ్ర భూసర్వే చేసి లోపరహితమైన సర్వాంగీకారయోగ్య మైన భూ వివరాలను ధరణిలో నమోదు చేయాలి. ఒకటికి రెండుసార్లు ప్రజా పరిశీలనకు పెట్టి, సమయమిచ్చి ఎలాంటి ఫిర్యాదులు రాని పక్షంలో ఆ భూముల వివరాలు ఫైనల్‌ చేసి ఆ తర్వాతే ధరణి ఆధారంగా రిజిస్ట్రేషన్‌, మ్యూటేషన్‌ చేసే విధానం ప్రవేశపెట్టాలి. ధరణి వివరాలు ఖచ్చితంగా లేక వివాదాలు వస్తే ప్రజలకు అప్పీల్‌ చేసుకునే వీలు కల్పించాలి.

విఆర్వోలు లేకపో యినా తహశీల్దార్‌లు అవినీతికి పాల్పడరని చెప్పలేం. ఒకవేల తహశీల్దార్‌లు, ఆర్‌డిఒలు అక్రమాలకు పాల్పడితే రైతులు ‘సివిల్‌ కోర్టులకు వెళ్లాల్సి ఉంది. కాని ఇప్పటికే కేసుల భారంతో కునారిల్లుతున్న ఈ సివిల్‌ కోర్టులు భూ వివాదాలను వేగంగా పరిష్కరిస్తాయా? అనేది పెద్ద సమస్యే. మరోవైపు ప్రస్తుత వివాదాలను విచారించి ట్రిబ్యునల్స్‌ ఇచ్చే తీర్పే ఫైనల్‌ అనటం సరికాదు.

ఖచ్చితంగా పై న్యాయస్థానాలకు వెళ్లే వీలు కల్పించాలి. చట్టం అమలులోకి వచ్చాక కౌలుదారులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు మంజూరు చేయాలి. తద్వారా వారు రుణసదుపాయం పొందే, పంటల బీమా పొందే వీలు కల్పించాలి. కొత్త రెవెన్యూ చట్టం తమ భూములను ఎక్కడ లాక్కుంటుందో అని ఇనాం భూములు పొందిన వారు భావిస్తున్నారు.

జాగీర్‌, సంస్థాన్‌, మక్తా, పైగా ఇనాం హక్కుదారులను జీవితకాలానికే పరిమితం చేసి, బదిలీ కుదరదని చెప్పడం తేనె తుట్టెను కదిలించడమే. ఆ విధంగా స్వాధీనం చేసుకోవడం ఆచరణసాధ్యమేనా? ఆలోచిం చాలి. అటువంటి భూములు ఇప్పటికే ఎన్నోసార్లు చేతులు మారాయో చెప్పలేం. అసలు ఇనాందారులు అమ్ముకోగా తమ కష్టార్జితంతో కొన్నవారి పరిస్థితి ఏమిటి? కేసులు పెరిగే అవకాశం ఉంది.

ఏదిఏమైనా కొత్త రెవెన్యూ సంస్కరణలతో భూ పరిపాలనలో సరికొత్త శఖం ఆవిష్కృతం కానుంది.

  • తండ ప్రభాకర్‌ గౌడ్‌

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/