ఆర్థికమంత్రి ముందున్న ‘వృద్ధి’ సవాళ్లు

The ‘growth’ challenges

మోడీ ప్రభుత్వానికి కొత్త బడ్జెట్‌ రూపంలో కొత్త సవాళ్లు ఎదురవుతు న్నాయి. ఇప్పటికే ఆరేళ్ల కనిష్టానికి ఆర్థిక వృద్ధి నమోదయింది. పెట్టుబడుల్లో వృద్ధి కనిపించడం లేదు. విదేశీ పెట్టుబడుల రూపంలో కూడా ఇన్వెస్టర్లు అంతగా ఆసక్తి చూపించడంలేదు.

మరోవైపు ఇరాన్‌, ఇరాక్‌, అమెరికా ఉద్రిక్తతలతో పెట్టుబడులు భారత్‌వైపు వస్తాయని భావించినా తైవాన్‌, సింగపూర్‌, మలేసియావైపుకు మళ్లుతున్నాయి. గల్ఫ్‌దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతలతో చమురు రంగంపై కూడా ఎక్కువ వ్యయభారం పడుతోంది. దీనితో ఇప్పుడు అత్యవసరంగా కొత్తబడ్జెట్‌ రూపంలో మోడీ సర్కారు ఆర్థికవృద్ధి పెంపొం దించేందుకు తక్షణ ప్రణాళికలు అమలు చేయాల్సిన అవసరాన్ని నొక్కిచెపుతోంది. ఐదుశాతం ఉన్న ఆర్థికవృద్ధి కనీసం వచ్చే ఏడాది అయినా ఏడుశాతానికి మించి ఉండాలన్న లక్ష్యం ఆర్థికమంత్రిని సవాల్‌ చేస్తోంది. అంతేకాకుండా 2024 నాటికి ఐదులక్షలకోట్ల డాలర్ల ఆర్థికవ్యవస్థ ఉన్న భారత్‌గా మారాలంటే ఇప్పటినుంచే సంస్కరణలు తప్పనిసరి అమలును సూచిస్తున్నాయి.

గత ఏడాది ఆర్థికవృద్ధికి ఊతం ఇవ్వాలని సుమారుగా 1.45 లక్షల కోట్లు ఖజానాకు భారం అయినప్పటికీ కార్పొరేట్‌ రంగానికి పలు మినహాయింపులు ఇచ్చింది. కార్పొరేట్‌ పన్నును 30 నుంచి 25శాతానికి తగ్గించింది. అలాగే కొత్త కంపెనీలకు 22శాతానికి మించి కట్టనవసరం లేదని వెల్లడించింది. వీటితోపాటే మూలధన లబ్ధిపై పన్ను మినహాయింపు, మరికొన్నింటికి సడలింపులు వంటి వాటితో కొన్ని సంస్కరణలు తక్షణమే అమలుకు వచ్చేటట్లు ఆదేశాలు జారీచేసింది. మొత్తం 11 బ్యాంకులను విలీనంచేసి నాలుగు పెద్ద బ్యాంకులుగా తీర్చేందుకు నిర్ణయించింది. సమగ్ర తర్జనభర్జనల అనంతరం వాటిని అమలు చేసేందుకు తక్షణ కార్యాచరణను అవలంభించింది.

పెట్టుబడుల ఉపసంహరణ పరంగా లక్షకోట్ల లక్ష్యం నిర్దేశించినా ఆ లక్ష్యం ఇప్పటికీ నెరవేరలేదు. కేవలం 17 వేలకోట్లకు మించి వాటాల విక్రయం కాలేదు. హెచ్‌పిసిఎల్‌ పూర్తిగా ఒఎన్‌జిసికి విక్రయం, ఎంటిఎన్‌ ఎల్‌, బిఎస్‌ఎన్‌ఎల్‌ విలీనం వంటి వాటితోనే లక్ష్యాలు నెరవేరలేదు. ప్రభుత్వప్రాజెక్టులు అంటే మౌలికవనరుల రంగంలో వ్యయం పెరిగితేనే ఉపాధి కల్పన పెరుగుతుంది. తద్వారా వనరుల సమీకరణ జరిగి నిధుల సమీకరణకు పెట్టుబడులకు అవకాశాలు పెరుగుతాయి.

దీనివల్ల విదేశీ పెట్టుబడులు మరింతగా సమకూరు తాయని మోడీ ప్రభుత్వం ఘంటాపథంగా చెపుతూ వచ్చింది. తీరా ఆర్థికసంవత్సరం ముగుస్తున్న దశలో ఇప్పటికీ ఆర్థికవృద్ధిపై మీనమేషాలు లెక్కించుకునే పరిస్థితి తలెత్తుతోంది. ఇక కార్పొరేట్‌ ఫలితాలు సైతం అంతగా ఆశాజనకంగా లేవు. టెలికాం రంగంలో తీవ్ర సంక్షోభం నెలకొంది. పెద్దపెద్ద సంస్థలు సైతం డీలపడు తున్నాయి. టెలికాం సంస్థలన్నీ కలిపితే ప్రభుత్వానికే లక్షలకోట్లు బకాయిలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో వీటికి బెయిల్‌ ఔట్‌ ప్యాకేజిని కూడా ప్రకటించాల్సిన అవసరం ఏర్పడింది. ప్రభుత్వ మానసపుత్రిక ఎయిర్‌ ఇండియాను ప్రైవేటీకరించే లక్ష్యం ఇప్పటికీ సాగుతూనే వస్తోంది. గడచిన రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు పన్నుల వసూళ్లు కూడా మందగించాయి.

సుమారు 80శాతంవరకూ ప్రత్యక్ష పన్నుల నుంచే వార్షిక ఆదాయం లక్ష్యాలు ఉంటాయి. అటువంటిది ఈసారి ఆర్థికసంవత్సరం చివరికి వస్తున్నా పన్ను లక్ష్యాలు చేరుకునే స్థితి కనిపించడంలేదు. ప్రస్తుత సంవత్సరంలో 13.5 లక్షలకోట్లు సమీకరించాలన్నది బడ్జెట్‌ లక్ష్యాలు చెపుతున్నాయి. అయితే వచ్చే మార్చి 31వ తేదీనాటికి అంచనా వేసుకుంటే 23శాతంవరకూ తగ్గవచ్చని ఆర్థికశాఖ అధికారులే చెపుతున్నారు. ఇందుకు ప్రధానకారణం పన్నురేట్లు తగ్గించడం, ఆర్థికమంద గమనం మరోసారి ఒత్తిడిని పెంచినట్లు తెలుస్తోంది. ప్రజల్లో కొనుగోలు సామర్థ్యం కూడా తగ్గింది. వ్యాపారాలు మందకొడిగా సాగడం, ఇటీవల దేశవ్యాప్తంగా చెలరేగుతున్న ఆందోళనలతో సమ్మెలు, బంద్‌లవల్ల వర్తక వాణిజ్యరంగానికి ఎక్కువ విఘాతం కలిగిందన్నది నిర్వివాదాంశం. ఈ అంశాల వారీగాచూస్తే పన్నులరాబడిపై వీటిప్రభావం ఎక్కువ చూపిస్తోంది.

ఆర్థికవృద్ధి ఐదుశాతానికే పరిమితం అవుతుందని, 11 ఏళ్ల కనిష్టస్థాయికి చేరవచ్చని ప్రభుత్వమే ప్రకటించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరోపక్క దావోస్‌ వేదికగా జరిగిన ప్రపంచ ఆర్థికవేదిక సదస్సులో కూడా భారత్‌ ఆర్థికవ్యవస్థపై ప్రతికూల వ్యాఖ్యలు వచ్చాయి. ఐఎంఎఫ్‌ చీఫ్‌, బిలియనీర్లు మరికొందరు మోడీ విధానాలను తూర్పారబట్టారు. ఐఎంఎఫ్‌ పరంగాచూస్తే ఆర్థికవృద్ధి వేగవంతం అయ్యేందుకు అవకాశాలున్నందున చొరవచూపించాలని సూచించినా భారత్‌ పరంగా ఇప్పుడు సంస్కరణలు మరింత వేగవంతం కావాలని పరిస్థితులు తేటతెల్లం చేస్తున్నాయి.

ప్రత్యక్షపన్నుల పరంగా చూస్తే 7.3 లక్షలకోట్లుమాత్రమే వచ్చాయి. పరోక్షపన్నులపరంగా జిఎస్‌టి వసూళ్లు మాత్రమే కొంత వేగం పుంజుకున్నాయి. లక్షకోట్లు దాటాయి. అయినా ఈ వేగంచాలదు. మరింత సంస్కరణలు వేగవంతం అయి పెట్టుబడులు రాక పెరగాలి. వాటాల అమ్మకం సత్వరమే ముగించి ఉపసంహరణ లక్ష్యాలు చేరుకుంటే తప్ప ఆర్థిక వృద్ధి పెరగదు. ఆర్థికలోటు భర్తీ కాబోదన్నది పాలకులు గుర్తించాల్సిన తరుణం ఇదే. ఆ దిశగానే బడ్జెట్‌ ప్రవేశపెట్టాల్సిన అవసరాన్ని ప్రస్తుత ఆర్థికవాతావరణం స్పష్టం చేస్తోంది.

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/health1/