మధ్య ప్రాచ్యంవైపు చైనా చూపు!

అగ్రరాజ్యాలకు సైతం ఆందోళన కల్గించే వైనం

China
China

ప్రపంచదేశాల్లో అమెరికా ఆంక్షలున్న దేశాలు, అమెరికా వైఖరిని ప్రశ్నిస్తున్న దేశాల వైపు ఇప్పుడు చైనా దృష్టి పెట్టింది.

నవంబరులో జరిగే ఎన్నికల్లో ఈ దేశాల ప్రమేయం కూడా ఉంటుందన్న అమెరికా పాలకుల భావనకు తగినట్లుగానే ఇప్పుడు ఈదేశాలు దగ్గరవుతున్నాయనడానికి ఇటీవలికాలంలో చైనా అనుసరిస్తున్న ధోరణులే కీలకం.

ఇప్పటికే నేపాల్‌, పాకిస్థాన్‌, శ్రీలంక వంటి భారత్‌ పొరుగుదేశాలను ప్రలోభపెడుతున్న చైనా దక్షిణచైనా సముద్ర జలాలు తమవేనంటూ ఆప్రాంత పరీవాహక దేశాలతో తగవు లకుసైతం వెనకాడటంలేదు.

చైనా దూకుడును తగ్గించేం దుకు పెద్దన్నగా అమెరికా రంగంలోకి దిగితే ఇప్పుడు ఏకంగా అమెరికాపైనే చైనా తన నిఘా నేత్రం ఎక్కుపెడుతున్నది.

ప్రపంచదేశాల్లో ఇరాన్‌ను ఏకాకిని చేయాలని అగ్రరాజ్యం యత్నిస్తుంటే చైనా ఆదేశానికి చేరువవుతోంది. దీనివల్ల మధ్యప్రాచ్య దేశాల్లో అమెరికా విధానాలపై తీవ్ర ప్రభావం ఉంటుందని చెప్పవచ్చు.

ఈ దేశాల వ్యవహారశైలి అమెరికా అధ్యక్ష ఎన్నికలను సైతం ప్రభావితం చేస్తాయన్న నిపు ణుల అంచనాలు తప్పుకాదనిపిస్తోంది.

ఇరాన్‌కు కనుక చేరువైన పక్షంలో మధ్యప్రాచ్యంలో చైనా చమురు, సహజవాయురంగంలో కూడా అడుగుపెడుతుంది. ఫలితంగా దేశాలమధ్య ఉద్రిక్తతలు పెరిగే ప్రమాదాలు పుష్కలంగా ఉన్నాయి.

దీనికితోడు చైనా, ఇరాన్‌లు ఇటీవలికాలంలో కీలక ఒప్పందం చేసుకోబోతున్నాయి. 18 పేజీల ఒప్పందముసాయిదా లీక్‌ కావడంతో అమెరికా పత్రికలు ప్రముఖంగా కూడా ప్రచురించాయి.

వాణిజ్య, ఆర్థిక,రాజకీయ సాంస్కృతిక భద్రతారంగాల్లో ఇరుదేశాలు వ్యూహాత్మక భాగస్వాములుగా మారనున్నాయని ఈ ఒప్పందం సారాంశం.

తమదేశానికి చెందిన కుర్దుఫోర్సెస్‌ కమాండర్‌ ఖాసింసులేమాని హత్యతర్వాత ఇరాన్‌ ప్రతీకారేచ్ఛతో రగులుతున్న సంగతి తెలిసిందే.

అమెరికా ఆంక్షల చట్రం అధిగమించి ఇతర దేశాలతో స్నేహ సంబంధాలు పెంచుకోవాలంటే చైనా వంటి అగ్రరాజ్యా లతో దోస్తీ కట్టేందుకు యోచిస్తోంది.

చైనాతో ఒప్పందం అనేది ఈవ్యూహాత్మక ముందడుగేనని చెప్పవచ్చు. మధ్య ప్రాచ్యంలో చైనా ఇరాన్‌లు జతకడితే అక్కడి దేశాలపై ప్రభావం ఎక్కువ ఉంటుందని ప్రత్యేకించి ప్రస్తావించ నవసరంలేదు.

చైనా ఈ ప్రాంతంలో తన పట్టుపెంచుకు నేందుకే మధ్యప్రాచ్యం వైపు దృష్టిపెట్టిందని చరిత్ర పరి శోధకులు చెపుతున్నారు. దీనికితోడు చైనా ఇతర అంశాల కంటే ఎక్కువగావాణిజ్యం, వ్యాపారధోరణులకే ఎక్కువ ఆసక్తితో ఉంది.

మధ్యప్రాచ్యంలో సహజ వాయు నిల్వలవైపు పెట్టుబడులుపెడితే స్వయంసమృద్ధి దిశగా ముందుకువెళ్లడం ఇరాన్‌వంటి దేశంతో ఒప్పం దాలకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.

ఇటీవలికాలంలో చైనానుంచి ఉధృతంగా వ్యాపించిన కరోనావైరస్‌తో ప్రపంచవ్యాప్తంగా మచ్చతెచ్చు కున్న చైనా విమర్శలు, అప్రతిష్ట నుంచి బైటపడేందుకు భావసారూప్యతకలిగిన దేశాలతో జట్టుకడుతోంది.

అందులోనూ అమెరికా అంటే విముఖత వ్యక్తంచేసే దేశాలవైపే గురిపెడుతున్నదని స్పష్టంగాచెప్పవచ్చు.ఇంధనం,రవాణా, బ్యాంకింగ్‌, సైబర్‌ సెక్యూరిటీరంగాల్లో చైనా పుష్కలంగా పెట్టుబ డులు పెడుతుంది.

ఆయుధాల అభివృద్ది, గూఢ చర్యంతో పాటు ఇరుదేశాల సంయుక్త సైనిక విన్యాసాలు కూడా ఈ ఒప్పందంలో ఉండటంతో ఇరాన్‌కు సుమారు 400 బిలియన్‌ డాలర్ల చైనా పెట్టుబడులు వస్తాయని అంచనా.

ఇప్పటికే చైనా నిర్మిస్తున్న బిఆర్‌ఐ కార్యాచరణలో ఇరాన్‌ భాగస్వామిగా ఉంది. చైనా రుణ దౌత్యం, సంప్రదింపుల పరంగా ఇదొక భాగమని నిపుణుల అంచనాల్లో వాస్తవం లేకపోలేదు.

అయితే చైనా ప్రభావంపై వ్యతిరేకతలు కూడా ఎక్కువే ఉన్నాయి.

ఖొమైనీ ప్రభుత్వం చైనాతో స్నేహహస్తం చాస్తుంటే మాజీ అధ్యక్షుడు అహ్మదీనెజాద్‌వంటి వారు వ్యతిరేకిస్తున్నారు. చైనాతో జరిగిన ఈ ఒప్పందం ఇరాన్‌పార్లమెంటు ఆమోదించాల్సి ఉంది.

అదే జరిగితే ఇక మధ్యప్రాచ్యంలో చైనా దూకుడు మరింత పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహంలేదు.

వైరస్‌ ఉధృతితో చైనా ప్రపంచదేశాలకు జవాబుదారీ కావాల్సివచ్చింది.

వుహాన్‌ వైరస్‌గా పేరుపెట్టి అమెరికా సమగ్రవిచారణకు పట్టుబట్టి సాధించుకుంది. అంతేకా కుండా చైనా అమెరికాల ట్రేడ్‌వార్‌ ఇప్పటికీ కొలిక్కిరా లేదు.

ఈపరిణామాల నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో చైనా ఉనికి మరింత బలపడితే అంతర్జాతీయంగా వివిధ దేశాల వాణిజ్య సంబంధాలు కూడా దెబ్బతింటాయని అగ్ర రాజ్యాలు కలవరపడుతున్నాయి.

ఇప్పటికే చైనా, అమెరికా లు రెండుదేశాల్లోను తమతమ దౌత్యకార్యాలయాలను మూసివేస్తున్నాయి. ఐటిరంగాల సంస్థలపై ఆంక్షలు పెంచాయి.

ఈపరిణామాలక్రమంలో వచ్చే నవంబరులో జరిగే అధ్యక్షఎన్నికల్లో కూడా ఈదేశాల గూఢచర్యం పని చేస్తుందని వేసిన అమెరికా అంచనాలు నిజమైనా ఆశ్చర్య పోనవసరంలేదు.

ఇప్పటివరకూ ఒక్క రష్యాకు మాత్రమే పరిమితమైన ఈ ఆరోపణలు ఇప్పుడు చైనా,ఇరాన్‌ దేశాలపై కూడా వస్తున్నాయి.

అదేనిజమైతే ట్రంప్‌ తన ఎన్నికల వ్యూహాలకు మరింతగా పదును పెట్టుకోవాల్సిన అవసరం ఉంది.

ఇప్పటికే తనను ఓడిం చేందుకు చైనా రష్యాతో జతకడుతుందని బాహాటంగానే చెప్పిన ట్రంప్‌ మధ్యప్రాచ్యంలో చైనా ముందడుగు వేయడాన్ని ఎట్టిపరిస్థితుల్లోను అంగీకరించరన్నది తెలిసిందే.

ఈ నేపథ్యంలోచైనాతో ఇరాన్‌దోస్తీ అనేది ఒక్క అమెరికాకే కాకుండా ఇతర అభివృద్ధిచెందిన అగ్రరాజ్యాలకు సైతం ఆందోళన కలిగించే విషయమేనని చెప్పకతప్పదు.

-దామెర్ల సాయిబాబ, ఎడిటర్‌, హైదరాబాద్‌

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/