క్షుద్రపూజలకు సమగ్ర చట్టమే శరణ్యం

Law

మానవుడు నిత్యం జీవన పోరాటంలో ఏదో విధమైన మానసిక ఒత్తిడిని ఎదు ర్కొంటుంటాడు. ఎండకు ఎండని, వానకు తవడని మానవ్ఞడు ఎలా ఉండడో కోరికలు లేని మనిషి లేరనే చెప్పొచ్చు. కోరికలు పెరిగే కొద్దీమనశ్శాంతి కరవ్ఞ కాకతప్పదు. వారివారి స్థాయిని బట్టి అవసరాలను బట్టి కోరికలు పెరుగుతూనే ఉంటాయి.

మరికొందరు రక రకాల సమస్యలతో వ్యధలతో మనశ్శాంతి కరవైన పరిస్థి తుల్లో ఆధ్యాత్మికం, భక్తి ముఖ్యంగా స్వామిజీల ఉపన్యా సాలు, ప్రవచనాలతో తమ సమస్యలకు పరిష్కారం దొరికి కొంతవరకైనా ప్రశాంతత లభిస్తుందనే గంపెడు ఆశతో ఆధ్యాత్మిక గురువ్ఞలను, బాబాలను ఆశ్రయిస్తుం టారు. భారతీయ ఆధ్యాత్మిక వాహినిలో స్వామిజీలు, గురువ్ఞల పాత్ర మహోన్నతమైనది. ఇలాంటి తులసీ వనంలో గంజాయి మొక్కలు కూడా మొలకెత్తడం మన గ్రహచారం.

స్వామిజీలను ఆశ్రయించి సమస్యలను పరి ష్కరించుకోవాలని తపనపడే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతున్నది. అయితే కొందరు స్వార్థపరులు స్వామి జీల అవతారం ఎత్తి ప్రజలను మోసం చేయడమేకాక చేయరాని పనులు కూడా చేస్తున్నారు. అంతర్జాతీయంగా పేరుపొందిన ఒక స్వామిజీ తాజాగా పోలీసులకు చిక్క కుండా విదేశాలకు వెళ్లి ఏకంగా ఒక ద్వీపాన్నే కొనుగోలు చేసి అక్కడ స్వతంత్రంగా రాజ్యాన్ని ఏర్పాటు చేసేందుకు సమాయత్తం అవ్ఞతున్నాడనే వార్తలు విస్మయం కలిగిస్తు న్నాయి.

అన్నివేల కోట్ల రూపాయలు ఎలా కూడబెట్టగలి గాడు?ఎంతమందిని మోసం చేశాడు? ఎలా తప్పించు కొని విదేశాలకు వెళ్లిపోయాడో అన్నీ జవాబు దొరకని ప్రశ్నలే. ఇక మరికొందరు స్వామిజీలు, బాబాలు జైళ్లల్లో కాలం గడుపుతున్నారు.త్రికరణశుద్ధిగా దైవాన్ని నమ్ముతూ ఆధ్యాత్మిక ప్రసంగాలు చేసే ఎందరో స్వామిజీలున్నారు. కానీ నకిలీ స్వాముల సంఖ్య పెరిగిపోతుండడం ఆందో ళన కలిగించే అంశం. ఇదికూడా ఒక వ్యాపారంగా మారి పోయింది. పెట్టుబడి పెట్టకుండా కుబేరులుగా మారడా నికి ఇది దగ్గర దారిగా ఎంచుకుంటున్నారు.

దీనికి కావా ల్సిందల్లా ప్రజల నమ్మకం,బలహీనతలే.అవేపెట్టుబడులు. ప్రజల బలహీనతలను, నాడీని పట్టుకొని విశ్వాసం కలి గించగలిగితే కనకవర్షం కురిసినట్లే. కనీస అర్హతలంటూ ఏమీలేవ్ఞ. వయస్సుతో నిమిత్తంలేదు.రాత్రికిరాత్రేకాషాయ వస్త్రాలు ధరించి తెల్లవారే సరికి స్వామిజీలుగా బాబాలు గా అవతారం ఎత్తవచ్చు. చిన్నపరిశ్రమ పెట్టాలన్నా, మరే చిన్న దుకాణం పెట్టాలన్నా ఎన్నో లైసెన్సులు, మరెంద రో అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది.

దీనికి అలాంటి ఇబ్బందులు లేవ్ఞ.అనుమతులు, లైసెన్సు లు కానీ అవసరం లేదు. నాయకులనో, అధికారులనో తమవైపు మళ్లించుకోగలిగితే ప్రభుత్వపరంగా రాయితీలు, భూములు పొందవచ్చు. అందుకే ఎక్కడపడితే అక్కడ స్వామిజీలు, బాబాలు వెలుస్తున్నారు. కొన్ని గ్రామాల్లో అయితే కనీసం తన పేరుకూడా రాసుకోలేని కాషాయ వేషధారణలో ఏవేవో చెప్పి ప్రజలను నమ్మిస్తున్నారు. ఇలాంటి వారు కొందరు చేసే వికృతచేష్టలు అమాయక గ్రామీణుల ప్రాణాల మీదకు కూడా తెస్తున్నాయి. మంత్రా ల పేరుతో రోగాలను నయం చేస్తామంటూ కిందపడేసి తొక్కడం, వాతలు పెట్టడం ఇష్టానుసారంగా కొట్టడం ఒకటేమిటీ వారికి తోచిన అటవిక చర్యలన్నీ చేస్తున్నారు.

మరికొందరు క్షుద్రపూజలు కూడా చేస్తున్నారు. తాజాగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి సమీపంలోని బైరవకోన ప్రాం తంలో క్షుద్రపూజలుచేస్తున్న ఒక ముఠాగూర్చి గ్రామస్తులు సమాచారం అందివ్వడంతో పోలీసులు రంగప్రవేశం చేసి అదుపులోకి తీసుకున్నారు.గుప్తనిధులకోసం గత అమా వాస్య మంగళవారం నాడు ఈ పూజలు నిర్వహిస్తుండగా పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఇందు లో ఆలయానికి సంబంధించిన అధికారి కూడా ఉండ టంతో ఆయనను సస్పెండ్‌ చేశారు. అంతకుముందు అనంతపురం జిల్లాలో కదిరి రూరల్‌పోలీసు స్టేషన్‌ పరిధిలోని కొర్తికోట శివాలయ ప్రాంతంలో క్షుద్రపూజలు చేస్తూ ఏకంగా ముగ్గురిని బలి ఇచ్చారు.

రక్తాన్ని ఆ ప్రాంతంలో ఉన్న పుట్టపై చల్లారు. బలికి గురైనవారిలో ఇద్దరు మహిళలు కాగా ఒక పురుషుడు ఉన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా చేతబడులంటూ మూఢనమ్మ కాలతో ప్రాణాలు తీస్తున్నారు. ఇది పోలీసులకు తెలిసినా వారికి ఉన్న వివిధ పనుల ఒత్తిడిలో పట్టించుకోలేకపోతున్నారు. ప్రాణాలు పోయినప్పుడో, మీడియాలో వచ్చినప్పుడు మాత్రమే ఏదోనామమాత్రపు కేసులు పెడుతున్నారు.

క్షుద్రపూజలు కేవలం ఒక తెలుగు రాష్ట్రాలకే కాదు ఒడిశా, ఛత్తీస్‌ఘడ్‌, జార్ఖండ్‌,బీహార్‌, అసొం, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ తదితర పధ్నాలుగు రాష్ట్రాల్లో విస్తరించి ఉందని అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. దీనివల్ల దేశంలో పదేళ్లలో సరాసరి దాదాపు రెండువేలకుపైగా హత్యలు జరిగినట్లు అధికార రికార్డులే వెల్లడిస్తున్నాయి.

అందులోనూ జార్ఖండ్‌ అగ్రస్థానంలో ఉంది. 2013లోనే ఒక్క జార్ఖండ్‌లో చేతబడులు చేశారనే అనుమానంతో 58 మందిని మట్టుపెట్టారు. ఇక మహారాష్ట్రలో విదర్భ ప్రాంతంలో పుత్రసంతానం కోసం 11మంది చిన్నారులను బలి ఇవ్వాలన్న భూతవైద్యుడు సలహా ఒక జంటను రాక్ష సులుగా మార్చింది.ఆ క్రమంలో వాళ్లు అభంశుభం తెలి యని ఐదుగురు పసికందులను పొట్టనపెట్టుకున్నతర్వాత కానీ పోలీసుల దృష్టికి రాలేదు. వీటన్నింటికి పటిష్టమైన చట్టమే మార్గమని జాతీయ మహిళా కమిషన్‌ ఏనాడో సూచించినా నేటికీ అది ఆచరణరూపం దాల్చలేదు.

మొత్తం మీద ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఆసరాగా తీసుకొని దగాతోనేకాక ప్రాణాలతో ఆటలాడుకుంటున్న ఈ నకిలీ బాబాలు క్షుద్రపూజలు చేస్తున్నవారిపై మరింత కఠినంగా వ్యవహరించాల్సిన సమయమిది.

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com/