పెరుగుతున్న ధరలు.. పట్టించుకోని పాలకులు

Dharna Against Prices Rise (File)

అదుపు అజ్ఞాలేకుండా పెరిగిపోతున్న ధరలను నియంత్రిస్తాం. నల్లబజారు దారులపై ఉక్కుపాదం మోపుతామంటూ ఎవరు అధికారంలో ఉన్నా చెప్పే మాటలే చెప్తు న్నారు తప్ప ఆచరణలో చేయలేకపోతున్నారు. స్వరం మారుతున్నదేతప్ప పాట మాత్రం పాతదే అన్నట్లుగా ఉంది ధరల నియంత్రణలో పాలకుల ధోరణి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ధరల నియంత్రణలో ఎందుకోఏమో కానీ మెతక వైఖరే అవలంభిస్తున్నారు. ఇటీవల అదుపు లేకుండా పెరిగిపోతున్న నిత్యావసర వస్తువ్ఞల ధరలతో సామాన్యుడు విలవిలలాడిపోతున్నాడు. ఒక్క రోజు ఉన్న ధర మరుసటి రోజు ఉండటం లేదు. ఒకప్రాంతంలో ఉన్న ధర మరో ప్రాంతంలో ఉండటం లేదు. ధరలు కొండెక్కడానికి గల కారణాలు, కారకులు ఎవరో? ఎవరికి చెప్పుకోవాలో? చర్యలు ఎవరు తీసుకుంటారో? సన్న జనంతోపాటు మధ్యతరగతి ప్రజలు కూడా దిక్కు తెలియక కొట్టుకుమిట్లాడుతున్నారు. పోని ఉత్పత్తి చేస్తున్న రైతుకు గిట్టుబాటు ధర వస్తుంది అనుకుంటే అదీ లేదు. అక్కడ పెట్టుబడులు పెరుగుతున్నాయి. పండించిన పంటలకు ధరలు తగ్గుతున్నాయి. పండించిన పంటలు అమ్ముకోవడం రైతులకు గగనమైపోతున్నది.

తెలంగాణాలో మొన్న ఒక రైతు ధాన్యాన్ని అమ్ముకునేందుకు మార్కెట్‌కు తెచ్చి ఐదు రోజులు పడిగాపులు కాచి ఎండవేడిమికి ధాన్యం కుప్పమీదనే అసువ్ఞలు బాసిన సంఘటన ప్రజాస్వామ్యవాదులను కలిచివేసింది. రైతుల వద్ద పంట ఉన్నప్పుడు వాటి ధరలు విపరీతంగా పడి పోతున్నాయి. వారి వద్ద నుంచి ప్రైవేట్‌ గోదాముల్లోకి చేరగానే ఒక వ్యూహం ప్రకారం కృత్రిమ కొరత సృష్టించి ఇష్టానుసారంగా ధరలు పెంచుకుంటున్నారు. ఇందులో కొందరు దళారులు కీలక పాత్ర వహిస్తున్నారన్న విషయం అధికారులతోపాటు పాలకులకు కూడా తెలియంది కాదు. దళారులు కమిషన్‌ల రూపంలో కోట్లాది రూపాయలు భోంచేస్తున్నారు. చట్టప్రకారం లైసెన్సులు పొందినా నిబంధనలను అతిక్రమించి అటు రైతులను, ఇటు వినియోగదారులను దోపిడీ చేస్తున్నారు. ఇలా దోపిడీ జరగకుండా నివారించి అటు రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించి మరొకపక్క వినియోగదారులకు సరైన ధరలకు నిత్యావసర వస్తువ్ఞలను అందించడంలో కీలక పాత్ర వహించాల్సిన మార్కెట్‌ కమిటీలు అటు రైతులను, ఇటు వినియోగదారులకు భక్షక కంపెనీలుగా తయారయ్యాయి.

అనేక చోట్ల దళారులను అదుపుచేయలేక కొందరు మార్కెట్‌ కమిటీ అధికారులు వారితోనే కుమ్మకైన సంఘటనలు కూడా జరిగాయి. రైతులు కూడా ఉద్యమించి ధర్నాలు చేశారు.ప్రజాస్వామ్యపద్ధతిలో ఎన్నికల కావాల్సిన రైతుల ప్రతినిధులు బంధువ్ఞలనో, తమ తోకలుగా, బాకాలుగా ఉన్న రాజకీయ కార్యకర్తలనో ఈ కమిటీల్లో నేతలు నియమించడం ప్రారంభం అయినప్పటి నుంచి పరిస్థితి మరింత అదుపు తప్పింది. ప్రజలతో తిరస్క రించబడిన వారు ఎన్నికల్లో పోటీ చేసే సత్తా లేనివారు ప్రజాసేవ అంటే ఏమిటో తెలియనివారిని సైతం ఈ కమిటీల్లో చొప్పిస్తున్నారు. పాలకుల దయాదాక్షిణ్యాలతో ఎంపికైన కమిటీలు నామమాత్రమే కాదు అవి దళారుల సంక్షేమంగా పనిచేసే పరిస్థితులు ఏర్పడ్డాయి. కొన్నిసార్లు ఇతర ప్రాంతాల నుంచి సరుకులు తెప్పించి మార్కెట్లోకి చొప్పించి స్థానిక రైతుల ఉత్పత్తులను కూడా దెబ్బతీస్తు న్నారు. రైతుల పేరుతోనే గ్రామాల్లో సరుకులు నిల్వ చేసుకొని కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెరిగిన తర్వాత మార్కెట్లోకి దించుతున్నారు. ఇలా ఇష్టం వచ్చిన రీతిలో ఇష్టానుసారంగా ధరలు పెంచుకుంటున్నారు.

ఈ భాగోతం అంతా బహిరంగంగా జరుగుతున్నా, ప్రజలు అల్లాడుతున్నా హెచ్చరికలు ప్రకటనలు, సమీక్షలు, సమా వేశాలతో కాలం గడుపుతున్నారే తప్ప ఏమీ చేయలేకపో తున్నారు. ధరలు అదుపు తప్పినప్పుడు ఇతర ప్రాంతాల నుంచి సరుకులు తెప్పించి వినియోగదారులకు అందు బాటులో ఉంచి ధరలను నియంత్రించే ప్రయత్నం పాల కులే చేసేవారు. గతంలో ఉల్లిగడ్డల ధరలు పెరిగినప్పుడు ప్రభుత్వమే ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసి విని యోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో ధరలు దిగివచ్చాయి. అలానే కందిపప్పు విషయంలో కానీ, ఇతర పప్పుధాన్యాల విషయంలో కొన్నిసార్లు అప్ర మత్తంగా ఉండి ధరలను సాధ్యమయ్యేంత వరకు నియం త్రించే ప్రయత్నం చేశారు. అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడెక్కడ గోదాముల్లో ఎంతెంత నిల్వలున్నాయి? నిబం ధనలకు అనుగుణంగా అవి ఉన్నాయా? వాస్తవంగాగోదా ముల్లో ఉన్నవాటికి రికార్డులపరంగా ఎన్ని ఉన్నాయి? వ్యత్యాసాలున్నాయా? తదితర విషయాలు పరిశీలించే వారు. ఇప్పుడు కూడా రికార్డులపరంగా పరిశీలనలు జరుగుతున్నాయే తప్ప క్షేత్రస్థాయిలో జరగడం లేదు. గతంలో విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులతో ఒక్కసారి రాష్ట్రవ్యాప్తంగా ఈ అక్రమ నిల్వలపై దాడులు జరిగాయి. ఆ కోట్లాది రూపాయల విలువైన అక్రమ నిల్వ లను స్వాధీనం చేసుకొని మార్కెట్లకు తరలించడంతో ఆనాడు ఒక్కసారిగా ఉన్న ధరలు తగ్గిపోయాయి. పాలకులు ఇప్పటికైనా ఈ దిశలో చర్యలు చేపట్టాలి. అదుపులేకుండా పెరిగిపోతున్న ఈ ధరలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. బడుగు,పేదవర్గాలే కాదు మధ్యతరగతి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ ధరల పెరుగుదల సమస్యను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించక తప్పదు.

  • దామెర్ల సాయిబాబ,ఎడిటర్‌, హైదరాబాద్‌