ప్రజారోగ్యాన్ని కబళిస్తున్న పాల కల్తీ!

Milk
Milk

క ల్తీ మహమ్మారి ప్రజారోగ్యాన్ని కబళి స్తున్నది. కల్తీని నిరోధించేందుకు చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని పాలకులు పదేపదే చెబుతున్నా ఈ కల్తీ రోజురోజుకు చాపకింద నీరులా విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది. తాగే నీటిలో కల్తీ, పప్పులో కల్తీ, నూనెల్లో కల్తీ, కారంలో కల్తీ, చివరకు ప్రాణాపాయం నుండి కాపాడే మందుల్లో కూడా కల్తీ. ఇక పౌష్టికాహారంగా వయసుతో ప్రమేయం లేకుండా పసిపిల్లల నుండి వృద్ధుల వరకు సేవించే పాలల్లో కల్తీ. అదీఇదీ అని కాదు. మొత్తం కల్తీమయంగా మారిపోతున్నది. రానురాను ఈ కల్తీ వల్ల మనిషి మనుగడకే ప్రమాదం వాటిల్లే సూచనలు కన్పిస్తున్నాయి. అన్నింటికంటే మించి ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల కారణంగా దేశవ్యాప్తంగా పాల ఉత్పత్తి తగ్గడంతో అది భర్తీ చేసేందుకు కొందరు దళారులు రసాయనికాలతో కృత్రిమపాలు తయారు చేసి ప్రజలకు అంటగడుతున్నా రు. ఉత్పత్తికి, వినియోగానికి ఉన్న వ్యత్యాసం పెరిగే కొద్దీ ఈ కల్తీ పెరిగిపోతున్నది. కల్తీ ఇంత ప్రమాదకరంగా మారుతున్నా పొగమంచులా అంతటా వ్యాపిస్తున్నా అడ్డగించేవారే కరవైపోయారు. కల్తీకి అవినీతికి అవినా భావ సంబంధం ఉంది. అందుకే పెరుగుతున్న అవినీతికి రెట్టింపుస్థాయిలో కల్తీ జరుగుతున్నది. కల్తీని అరికట్టేందు కు చట్టాలున్నాయి. అమలు చేసి కల్తీని నిరో ధించేందుకు దేశవ్యాప్తంగా వేలాది కోట్ల రూపాయలు జీతాలు తీసు కుంటున్న అధికారగణం కూడా ఉంది. ఈ అధికారులు కానీ, ఆ చట్టాలు కానీ కల్తీని నిరోధించలేక పోతున్నాయి. ఈ కల్తీ తెలుగు రాష్ట్రాల్లోనూ, లేక భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నది. కోట్లాది మంది అనారోగ్యానికి గురై ఆస్పత్రిపాలవ్ఞతుండగా కొందరు శాశ్వత రోగాలబారిన పడుతుంటే మరికొందరు ప్రాణాలు కల్తీకి బలైపోతున్నాయి.పాలల్లో జరుగుతున్న కల్తీ మానవ జీవనాన్నే ప్రశ్నార్థకంగా మారుస్తున్నది. ఈ కల్తీ మూడో కంటికి తెలియకుండా జరగడంలేదు. పరిశోధించి, మాటు వేసి పట్టుకోవలసిన పనికూడా లేదు. అంతేకాదు కల్తీ పాల అమ్మకాలు ఏదో రహస్యంగా జరగడం లేదు. బహి రంగంగా జరుగుతున్న వ్యాపారమే. యూరియా లాంటి రసాయనిక ఎరువ్ఞలను కలిపి పాలను తయారు చేసి అమ్ముతున్నారంటే పరిస్థితి ఎంతవరకు వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. అసలు స్వచ్ఛమైన పాల లభ్యత అనేది సమస్యగా మారిపోయింది. విచ్చలవిడిగా సాగుతున్న పాలకల్తీ ప్రజారోగ్యానికి సవాల్‌గా పరిణమిస్తుంది. ప్రపంచ పాలవ్యాపారాన్ని శాసించే న్యూజిలాండ్‌ దేశపు ముఖ్యమైన కంపెనీ విక్రయించే పాలపొడిలో డైసిండిమెడ్‌ (డీసీడీ) అనే రసాయనికం కన్పించడంతో నివ్వెరపో యారు. ఆ దేశ ప్రభుత్వం అప్రమత్తమై తక్షణ నష్ట నివారణ చర్యలు తీసుకునేందుకు నడుంకట్టింది. అక్కడే కాదు భారతదేశంతోసహా ప్రపంచవ్యాప్తంగా పాలల్లో కల్తీ ప్రమాదస్థాయికి చేరిందని చెప్పొచ్చు. ఈ విషయంలో సర్వోన్నత న్యాయస్థానం కూడా కల్పించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దేశంలో ప్రజలకు విక్రయించే పాలల్లో దాదాపు 69 శాతం కల్తీయేనన్న వాస్తవం సాక్ష్యాత్తు జాతీయ ఆహార భద్రతాప్రమాణాల మండలి తనిఖీల్లో వెల్లడైంది. గతంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి 33 చోట్ల తనిఖీలు నిర్వహిస్తే ఆరు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో వందకు వంద శాతం కల్తీ జరుగుతుందని బయటపడింది.మిగతా ప్రాం తాల్లో కూడా పరిస్థితి తీవ్రంగానే ఉంది. ఇంతజరిగినా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల్లో కదలికలు లేకపోవడంతో సర్వో న్నత న్యాయస్థానమే ఈ సమస్యపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇంతపెద్ద సమస్యపై పాలకులు ఏం చేస్తున్నారో చెప్పమంటూ కోర్టు నిగ్గదీసి అడిగింది. దేశంలో అమ్ముతు న్న పాలల్లో 70 శాతం వరకు సురక్షితం కాదని భారత ఆహార భద్రతాప్రమాణాల సంస్థ గతంలో వెల్లడించింది. ఈ దురాఘాతాలను నిలువరించడంలో విఫలమవ్ఞతున్న అధికారులపై ఎలాంటి క్రమశిక్షణాచర్యలు తీసుకున్నా రంటూ సుప్రీంకోర్టు కూడా ఒకసారి కేంద్ర,రాష్ట్ర ప్రభు త్వాలను ప్రశ్నించింది. పాల వినియోగం అంతకంతకు పెరుగుతుంటే మరొకపక్క ఉత్పత్తులు తగ్గిపోతున్నాయి. దాదాపు 30 శాతంపైగా లోటు కన్పిస్తున్నట్టు అధికార వర్గాలే అంగీకరిస్తున్నాయి. దీనిని అధిగమించేందుకే విచ్చలవిడిగా కల్తీ చేస్తున్నారు. రసాయనికాలతో సింథటిక్‌ పాలను తయారు చేస్తుండగా మరికొన్ని హోటళ్లలో విక్రయించే పన్నీర్‌బటర్‌ మసాలా వంటి కూరల్లో కూడా సింథటిక్‌ పాలను అధికంగా వాడుతున్నట్లు బయట పడింది. బీహార్‌, జార్ఖండ్‌, ఒడిశా, పశ్చిమబెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో జరిపిన తనిఖీల్లో కూడా ఈ కల్తీ పాలు పెద్దఎత్తునే బయటపడ్డాయి. తెలంగాణా లో ఒక పాలవ్యాపారి ఇంటిపై దాడిచేస్తే యూరియా డిటర్జంట్‌ వంటి రసాయనికాలతో తయారు చేసిన కృత్రి మ పాలను కనుగొన్నారు. ఆ వ్యాపారి ఎంతోకాలంగా ఇలాంటి పాలను అమ్ముతున్నాడు. ఇక గ్రామాల నుంచి వచ్చేవారు ఎక్కడపడితే అక్కడ ఏ నీళ్లు అంటే ఆ నీళ్లను పాలల్లో కలిపి అమ్ముకుంటున్నారు. ఫ్లోరైడ్‌ తదితర రసాయనికాలు ఉన్న నీళ్లను కలపడంతో ప్రజారోగ్యంపై ఎంత ప్రభావం పడుతున్నదో గుర్తించడం లేదు. దీనికి పరిష్కారం కల్తీపై ఉక్కుపాదం మోపడమేకాక పాల ఉత్ప త్తులు పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక మైన శ్రద్ధ తీసుకోవాలి. భారీఎత్తున సన్నకారురైతులకు సబ్సిడీపై సమృద్ధిగా పాలిచ్చే సంకరజాతి ఆవ్ఞలను, గేదెలను సరఫరా చేయాలి. నిర్వహణకు అవసరమైన సదుపాయాలను కూడా ప్రభుత్వం కల్పించే దిశగా చర్య లు తీసుకోవాలి. అలాగే ప్రభుత్వరంగంలో నడుస్తున్న డెయిరీలను నష్టాల ఊబిల నుండి గట్టెక్కించాలి. పాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని నిర్దిష్టమైన ప్రణాళిక బద్ధమైన చర్యలు తీసుకోకపోతే పాలకొరత తీవ్రంగా ఏర్పడి కల్తీరూపంలో ఆ కొరతను భర్తీ చేసేందుకు దళారులు విజృంభిస్తారు. అది మనిషి మనుగడకే ప్రమాదకరం.

  • దామెర్ల సాయిబాబ, ఎడిటర్‌, హైదరాబాద్‌